కాంచీపురంలో కాల్పుల కలకలం రేగింది. ఓ అమ్మాయి ప్రేమ కోసం ఇద్దరు విద్యార్థులు కొట్టుకున్నారు. ఆ అమ్మాయి నాదంటే  నాది అంటూ...ఘర్షణ పడ్డారు. ఆ తర్వాత తుపాకీతో కాల్చి ఓ యువకుడిని మరో యువకుడు అతి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలో చోటుచేసుకుంది.

కాంచీపురం జిల్లా తాంబరం సమీపంలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.  తాంబరం ప్రాంతానికి చెందిన ముఖేష్, విజయ్ లు.. స్థానికంగా ఉన్న పాలిటెక్నిక్ కాలేజీలో ట్రిపుల్ ఈ చదువుతున్నారు.  అదే కాలేజీలోని ఒకే అమ్మాయిని ఈ ఇద్దరు యువకులు ప్రేమించారు.

ఈ ప్రేమ విషయంలో.. ఇదివరకే ఇరువురి మధ్య పలు వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. అప్పటికే.. ఆ అమ్మాయిని వదిలేయాలంటూ ముఖేష్‌ని హెచ్చరించాడు.  అతని హెచ్చరికలను ముఖేష్ పట్టించుకోకపోలేదు. తాను ఆ అమ్మాయినే ప్రేమిస్తానంటూ భీష్మించుకు కూర్చున్నాడు. దీంతో ముఖేష్ పై విజయ్ పగబట్టాడు.

పథకం ప్రకారం..వండలూర్ పంచాయతీ వెంకట మంగళం గ్రామంలో ముఖేష్ ఇంటికి వెళ్లి మరీ.. అతన్ని.. గన్‌తో కాల్చిచంపేశాడు.  అనంతరం అక్కడి నుంచి నిందితుడు పరారయ్యాడు. 

గాయాలతో ఉన్న ముఖేష్‌ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.. కాగా..ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముఖేష్ చనిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.