తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కళాశాల ఎండీ బాగోతాన్ని చాకచక్యంగా బహిర్గతం చేసింది ఒక యువతి. కోయంబత్తూరు ఎంఎన్ఎస్‌ కళాశాలలో ఓ యువతి పనిచేస్తోంది. ఈ క్రమంలో కళాశాల ఎండీ ఏదో ఒక పని చెప్పి తరచూ ఆమెను తన గదిలోకి పిలిపించుకుని లైంగిక వేధింపులకు పాల్పడేవాడు.

రెండేళ్ల నుంచి మౌనంగా అతని వేధింపులు భరిస్తున్న ఆమె ఎండీకి బుద్ధి చెప్పాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా ఎండీ ఛాంబర్‌లో సీక్రెట్ కెమెరాలను పెట్టింది. ఒక రోజు యువతిని ఎండీ తన గదిలోకి పిలిచి అసభ్యంగా తాకుతూ.. అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. ఈ దృశ్యాలు కెమెరాలో రీకార్డయ్యాయి.

వీటిని తీసుకుని యువతితో సహా తోటి ఉద్యోగులు ఎండీ కుమారుడు వద్ద తెలపగా.. అతను ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం విదేశాల్లో పెద్ద తప్పేమి కాదని సమర్థించడమే కాకుండా.. మీ పనులు మీరు చూసుకోండి లేదంటే ఉద్యోగాలు పోతాయని హెచ్చరించాడు.

అంతేకాకుండా కెమెరాలు పెట్టి తన తండ్రి పరువుకు నష్టం కలిగించినందుకు సదరు యువతిని ఉద్యోగంలో నుంచి తొలిగించాడు. దీంతో ఆ యువతి ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.