తన నిజాయితీ, వేగంగా స్పందించే గుణం, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గని తత్వంతో తెలుగు ఐఏఎస్ రోహిణి సింధూరి కర్ణాటకలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆమెకు భారీగా అభిమానులు వున్నారు. అయితే మైసూరు జిల్లా కలెక్టర్‌గా ఆమె ధోరణి వివాదాలను తెచ్చి పెట్టింది. డీసీ రోహిణి తనను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ మైసూరు నగరపాలక సంస్థ కమీషనర్ శిల్పా  నాగ్ మీడియా ముందే ఆరోపణలు చేశారు. అంతటితో ఆగకుండా అప్పటికప్పుడే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

అటు శిల్పా నాగ్‌కు మద్ధతుగా మైసూర్ కౌన్సిల్ సభ్యులు .. రోహిణిపై ఆరోపణలు చేశారు. కలెక్టర్‌ను తక్షణం బదిలీ చేయాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం ఇద్దరు ఐఏఎస్‌లపై బదిలీ వేటు వేసింది. రోహిణి సింధూరిని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్​గా బదిలీ చేశారు. అయితే, ఈ బదిలీని రద్దు చేయాలని ఆమె సీఎం యడియురప్పను కోరగా సాధ్యంకాదని చెప్పినట్లు తెలిసింది.  

Also Read:తెలుగు ఐఏఎస్‌ రోహిణి సింధూరిపై ఆరోపణలు: బదిలీ చేయాలంటూ మైసూరు కౌన్సిల్ పట్టు

ఈ సందర్భంగా రోహిణి సింధూరి మాట్లాడుతూ.. మైసూరు జిల్లా ప్రజలు తనను ఇంటి బిడ్డగా చూసుకున్నారని ఉద్వేగానికి గురయ్యారు. ఇక్కడి నుంచి వెళుతుంటే పుట్టింటి నుంచి వెళుతున్నట్లు ఉంది, ప్రజలకు చాలా ధన్యవాదాలు అని రోహిణి సింధూరి చెప్పారు. సోమవారం మైసూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. మైసూరు జిల్లా గురించి అన్ని విషయాలను కొత్త కలెక్టర్‌కు వివరించానని తెలిపారు. తాను ఇలాంటి సమయంలో బదిలీ అవుతానని అనుకోలేదన్నారు.