కూప్పకూలిన టన్నెల్.. కొత్త డ్రిల్లింగ్ మెషిన్ తో రెస్క్యూ పున:ప్రారంభం.. ఉత్తరకాశీకి చేరుకున్న వీకే సింగ్
uttarkashi tunnel collapse : ఉత్తరాకాశీలో కుప్పకూలిన టన్నెల్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాలను తొలగించేందుకు అత్యాధునిక డ్రిల్లింగ్ మెషన్ లను ఉపయోగిస్తున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు కేంద్ర మంత్రి వీకే సింగ్ అక్కడికి చేరుకున్నారు.
uttarkashi tunnel collapse : ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీలోని సిల్క్యారాలో నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న 40 మంది కార్మికులను వెలికితీసే సహాయక చర్యలు ఐదో రోజు కూడా కొనసాగుతున్నాయి. రెస్క్యూ సిబ్బంది నిరంతరంగా కమ్యూనికేషన్ చేస్తూ కార్మికుల మానసిక ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. అయితే శిథిలాలను తవ్వి, కార్మికులను బయటకు తీసుకురావడానికి అత్యాధునిక ఆగర్ డ్రిల్లింగ్ మెషన్ తో తాజాగా పనులు పున: ప్రారంభించారు.
24 టన్నుల బరువున్న అత్యాధునిక పనితీరు కలిగిన ఈ మెషన్ గంటకు 5 మిల్లీమీటర్ల వేగంతో సొరంగాన్ని కత్తిరించే సామర్థం ఉంది. కాగా.. 800 మీటర్ల పైపులను లోపలికి పంపించాలంటే దాదాపు 50 మీటర్ల శిథిలాలను కత్తిరించాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. సహాయక చర్యలను పరిశీలించేందుకు కేంద్ర మంత్రి జనరల్ (రిటైర్డ్) వీకే సింగ్ గురువారం సొరంగం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’తో మాట్లాడుతూ.. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని, కార్మికులు క్షేమంగా తిరిగి వస్తారని తమకు పూర్తి నమ్మకం ఉందని అన్నారు. తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.
శిథిలాల మధ్య పెద్ద పైపును వేసి చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు రెస్క్యూ టీం ప్రయత్నిస్తోంది. ఈ పైపుల్లో ట్రాక్ లను ఏర్పాటు చేసి టన్నెల్ నుంచి కార్మికులను బయటకు తీసుకురావచ్చని, దీని వల్ల కార్మికులు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని సంబంధిత వర్గాలు ‘ఇండియా టుడే’తో తెలిపాయి.
కార్మికులు సురక్షితంగా ఉన్నారని, వారికి పైపుల ద్వారా ఆక్సిజన్, విద్యుత్, మందులు, ఆహార పదార్థాలు, నీరు సరఫరా చేస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రతిష్టాత్మక చార్ ధామ్ ఆల్ వెదర్ రోడ్డు ప్రాజెక్టులో భాగమైన సొరంగంలో కొంత భాగం ఆదివారం కొండచరియలు విరిగిపడటంతో కూలిపోయిన సంగతి తెలిసిందే. అందులో 40 మంది కార్మికులు చిక్కుకోగా.. వారిని రక్షించే ప్రయత్నాలు అప్పటి నుంచి సాగుతున్నాయి.