tunnel collapse : కుప్పకూలిన సొరంగం.. సహాయక చర్యల్లో ఆటంకాలు.. ఆగ్రహంతో ఆందోళన చేపట్టిన కార్మికులు
Uttarakhand tunnel collapse : ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న టన్నెల్ కుప్పకూలింది. అయితే అందులో 40 మంది కార్మికులు చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు ఆదివారం నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే నాలుగు రోజులైనా వారిని ఇంకా బయటకు తీసుకురాకపోవడంతో ఇతర కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ జిల్లాలో సొరంగంలో చిక్కుకున్న 40 మంది కార్మికులను రక్షించే ప్రయత్నాలు బుధవారం కూడా కొనసాగుతున్నాయి. అయితే ఈ సహాయక చర్యల్లో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. దీంతో ఇతర కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘటనా స్థలంలోనే ఆందోళనకు దిగారు. తోటి కార్మికులను వెంటనే బయటకు తీసుకురావాలని నినాదాలు చేశారు.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం సొరంగం లోపల డ్రిల్లింగ్ కోసం తీసుకువచ్చిన ఆగర్ యంత్రం 2 మీటర్లు తవ్విన తర్వాత పగిలిపోయింది. దీంతో కొద్దిసేపు సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. ఈ విషయం బయట ఉన్న కార్మికులకు తెలిసింది. ఘటన జరిగి నాలుగు రోజులు గడుస్తున్నా అందులో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకురాలేకపోవడంతో వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.
దీంతో వారు ఆందోళన వ్యక్తం చేశారు. తమ వాళ్లను సురక్షితంగా బయటకు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ.. ‘‘హమారే ఆద్మీ నికాలో..’’(మా మనుషుల్ని బయటకు తీయండి..) అంటూ నినాదాలు చేశారు. అక్కడున్న అధికారులను వారిని సముదాయించారు. నిరసనకారులను శాంతింపజేశారు.
సహాయక చర్యల్లో భాగంగా శిథిలాల గుండా స్టీల్ పైపులను చొప్పించడానికి ఆగర్ డ్రిల్లింగ్ యంత్రానికి ఒక వేదికను సిద్ధం చేయాల్సి ఉంది. దీని కోసం రెస్క్యూ సిబ్బంది గంటల తరబడి శ్రమించారు. అయితే మంగళవారం రాత్రి కొండచరియలు విరిగిపడటంతో సిబ్బంది ఆ యంత్రాన్ని తొలగించాల్సి వచ్చింది. మళ్లీ ప్లాట్ఫారమ్ పనులను ప్రారంభించారు. అయితే శిథిలాల కింద పడిన ఇద్దరు రెస్క్యూ వర్కర్లను సంఘటనా స్థలంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు. అయితే కొండచరియలు విరిగిపడిన సమయంలో పైనుంచి శిథిలాలు పడ్డాయి. దీంతో తొక్కిసలాట లాంటి పరిస్థితి నెలకొనడంతో సహాయక చర్యలకు మళ్లీ అంతరాయం కలిగింది.
కాగా.. సొరంగంలో చిక్కుకున్న కార్మికుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. మరోవైపు సహాయక చర్యలకు నేతృత్వం వహిస్తున్న ఎస్డీఆర్ఎఫ్ కమాండెంట్ మణికాంత్ మిశ్రా కూడా మంగళవారం వారితో మాట్లాడారు. కార్మికుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తామంతా క్షేమంగానే ఉన్నామని కార్మికలు బదులిచ్చారు. అయితే బయట జరుగుతున్న సహాయక చర్యలను కార్మికులకు ఆయన వివరించారు. కాగా.. బుధవారం సాయంత్రం వరకైనా కార్మికులను బయటకు తీసుకువస్తామని అధికారులు చెబుతున్నారు.