ఢిల్లీలో రేపటి వరకు చలిగాలులు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో జనవరి 2వతేదీ వరకు తీవ్ర చలిగాలులు వీస్తాయని కేంద్ర వాతావరణ శాఖ తన బులిటిన్ లో వెల్లడించింది. 

ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం దట్టమైన పొగమంచు దుప్పటిలా కప్పేసిందని ఈ బులిటిన్ లో వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఢిల్లీతోపాటు పంజాబ్, హర్యానా, చంఢీఘడ్ ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కప్పేయడంతోపాటు చలిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. 

రాగల 24 గంటల పాటు రాజస్థాన్ రాష్ట్రంలోనూ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని అధికారులు చెప్పారు. ఢిల్లీలో కాలుష్యం పెరిగిందని, గాలిలో కాలుష్యం 332 గా ఉందని అధికారులు చెప్పారు. 

ప్రజలు చలి గాలుల నుంచి రక్షణ కోసం ఇళ్లలో నుంచి బయటకు రావద్దని, అవసరమైతే ఉన్ని దుస్తులు ధరించి జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.