తమిళనాడులోని కోయంబత్తూరు డిఐజీ గన్ తో పేల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. క్యాంపు కార్యాలయంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు.
కోయంబత్తూర్ : తమిళనాడులోని కోయంబత్తూరులో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. డిప్యూటి ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (కోయంబత్తూరు రేంజ్) సి విజయకుమార్ శుక్రవారం ఉదయం ఇక్కడి రేస్ కోర్స్‌లోని తన క్యాంపు కార్యాలయంలో పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, విజయకుమార్ ఉదయం వాకింగ్‌కు వెళ్లి 6.45 గంటలకు తన క్యాంపు కార్యాలయానికి వచ్చాడు. ఆ తరువాత తన పిస్టల్ ఇవ్వమని తన వ్యక్తిగత భద్రతా అధికారి (పిఎస్‌ఓ)ని కోరాడు. ఆ పిస్టల్ తీసుకుని కార్యాలయం నుండి బయటకు వచ్చాడు. ఉదయం 6.50 గంటల ప్రాంతంలో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
క్యాంపు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఇతర పోలీసులు పిస్టోల్ శబ్దానికి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే సీనియర్ పోలీసు అధికారులకు సమాచారం అందించారు.
కొన్ని వారాలుగా తనకు నిద్ర సరిగా పట్టడం లేదని.. దీంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నానని.. విజయకుమార్ తన తోటి అధికారులతో చెప్పినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోయంబత్తూరు మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. దీనిమీద తదుపరి విచారణ కొనసాగుతోంది.
విజయకుమార్ జనవరి 6, 2023న కోయంబత్తూరు రేంజ్ పోలీసు డిఐజిగా బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందున్న డిఐజీ ఎంఎస్ ముత్తుసామిని వేలూరు రేంజ్ డిఐజిగా నియమించడంతో ఆయన బదిలీ మీద ఇక్కడికి వచ్చారు.
విజయకుమార్ 2009 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. గతంలో కాంచీపురం, కడలూరు, నాగపట్నం, తిరువారూరు జిల్లాల్లో పోలీసు సూపరింటెండెంట్‌గా పనిచేశారు. ఆ తర్వాత చెన్నైలోని అన్నానగర్‌లో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా పనిచేశారు. డీఐజీగా పదోన్నతి పొంది కోయంబత్తూరు రేంజ్‌లో నియమితులయ్యారు.
