Mumbai: దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో రూ.20 కోట్ల విలువైన కొకైన్ ను ఎన్సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, ఇద్దరు విదేశీయులను అదుపులోకి తీసుకున్నారు.
NCB seizes cocaine worth Rs 20 cr: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఒక అంతర్జాతీయ మాదకద్రవ్యాల (డ్రగ్స్) అక్రమ రవాణా సిండికేట్ ను ఛేదించింది. దీనిలో ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సుమారు 20 కోట్ల రూపాయల విలువైన కొకైన్ సరుకును స్వాధీనం చేసుకుంది. అలాగే, ఇద్దరు విదేశీ పౌరులను సైతం అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకెళ్తే.. అంతర్జాతీయ డ్రగ్స్ దందాకు తెరలేపిన కొందరు విదేశీయులు.. దేశ ఆర్థిక రాజధాని ముంబయిని కేంద్రంగా చేసుకుని వివిధ ప్రాంతాల్లో మాదక ద్రవ్యాల (డ్రగ్స్) కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారం అందుకున్న ముంబయి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు.. దాదాపు 20 కోట్ల విలువైన కొకైన్ ను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఈ డ్రగ్ ముఠాకు చెందిన ఇద్దరు విదేశీ పౌరులను అదుపులోకి తీసుకున్నారు. ఇదివరకు ఒక అంతర్జాతీయ సిండికేట్ ద్వారా కన్ సైన్ మెంట్ సరఫరాకు సంబంధించిన సమాచారాన్ని ముంబయి ఎన్సీబీ అధికారులు సేకరించారు.
తదనుగుణంగా, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ)-ముంబయి అధికారులు నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే డ్రగ్స్ ముఠాకు చెందిన వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ డ్రగ్స్ రాకెట్ లో మారిండా ఎస్ అనే దక్షిణాఫ్రికా మహిళ గుర్తించబడింది. ఇథియోపియాలోని అడిస్ అబాబా నుంచి నవంబర్ 20న ముంబయి విమాన ప్రయాణం చేయాల్సి ఉందని ఎన్సీబీ ముంబయి విశ్లేషించింది. దీని ప్రకారం, ఎన్సీబీ-ముంబయి అధికారులు వెంటనే అప్రమత్తమై నగరంలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని సదరు మహిళను పట్టుకోవడానికి లేఅవుట్‌ను ఏర్పాటు చేశారు. కొద్దిసేపటికి, అడిస్ అబాబా నుండి విమానం చేరుకుంది.. మహిళ భౌతికంగా గుర్తించి.. ఆమెను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు.
ఈ క్రమంలోనే చట్టపరమైన ప్రక్రియకు అనుగుణంగా జరిపిన తనిఖీలలో ఆమె వస్తువుల నుండి 2.800 కిలోల నాణ్యమైన కొకైన్‌ను రికవరీ చేశారు. అవి అనుమానాస్పద వస్తువుల మధ్య చాలా జాగ్రత్తగా దాచబడ్డాయి. వివిధ పరిమాణాల ఎనిమిది ప్యాకెట్లలోని నిషిద్ధ వస్తువులు రెండు జతల షూలలో గుర్తించారు. ప్రత్యేక కావిటీలను రూపొందించడం ద్వారా రెండు పర్సులు చాలా జాగ్రత్తగా లోపల దాచినట్టు అధికారులు గుర్తించారు.
విచారణ సమయంలో ముంబయిలోని అంధేరిలో ఉన్న ఒక హోటల్‌లో ఉన్న ఒకరికి సరుకును డెలివరీ చేయాల్సి ఉందని విదేశీ జాతీయురాలు వెల్లడించింది. తదనంతరం, ఒక బృందం హోటల్‌కు చేరుకుని నిఘా ఉంచింది. కొద్దిసేపటి తర్వాత, ఆఫ్రికాకు చెందిన ఒక మహిళ వచ్చి అనుమానాస్పద కదలికతో ఆ ప్రాంతంలో వేచివుంది. ఎన్సీబీ అధికారులు ఆమెను అడ్డగించి ప్రశ్నించారు. అయితే, సదరు నైజీరియన్ జాతీయుడు పిచ్చి సమాధానాలు చెప్పడంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ జరపడంతో అసలు విషయం ఒప్పుకుంది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన మహిళ నుంచి మరింత సరుకు తీసుకునీ, నగరంలో సరఫరా చేయాల్సి ఉందని తెలిపింది. కొకైన్ అక్రమ ఉత్పత్తికి కేంద్రంగా ఉన్న దక్షిణ అమెరికా నుంచి ఈ డ్రగ్‌ని సేకరించారు. తదుపరి విచారణ జరుగుతోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
