దేశ రాజధాని ఢిల్లీని కరెంట్ కష్టాలు వెంటాడుతున్నాయి. బొగ్గు కొరత కారణంగా మెట్రో రైలు, ఆస్పత్రులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయే అవకాశం ఉందని ఢిల్లీ ప్రభుత్వం హెచ్చరింది.
దేశ రాజధాని ఢిల్లీని కరెంట్ కష్టాలు వెంటాడుతున్నాయి. బొగ్గు కొరత కారణంగా మెట్రో రైలు, ఆస్పత్రులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయే అవకాశం ఉందని ఢిల్లీ ప్రభుత్వం హెచ్చరింది. బొగ్గు కొరత తీవ్రమవుతున్న నేపథ్యంలో.. మెట్రో రైళ్లు, ఆసుపత్రులతో సహా రాజధానిలోని ముఖ్యమైన సంస్థలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరాను అందించడంలో ఇబ్బంది ఏర్పడుతుందని ఢిల్లీ ప్రభుత్వం హెచ్చరించింది. ప్రస్తుత పరిస్థితిని అంచనా వేయడానికి ఢిల్లీ విద్యుత్ శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. దేశ రాజధానికి విద్యుత్ సరఫరా చేసే పవర్ ప్లాంట్‌లకు తగిన బొగ్గు లభ్యతను పెంచాలని అభ్యర్థిస్తూ కేంద్రానికి లేఖ రాశారు.
‘‘దాద్రీ-II, ఉంచాహర్ పవర్ స్టేషన్ల నుంచి విద్యుత్ సరఫరా అంతరాయం కారణంగా.. ఢిల్లీ మెట్రో, ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రులతో సహా అనేక ముఖ్యమైన సంస్థలకు 24 గంటల విద్యుత్ సరఫరా అందించడం కష్టంగా మారుతుంది’’ ఢిల్లీ ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం ఢిల్లీ విద్యుత్ డిమాండ్‌లో 25 నుంచి 30 శాతం వరకు ఈ పవర్ స్టేషన్ల ద్వారానే అందుతుందని.. అవి బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నాయని సత్యేంద్ర జైన్ చెప్పారు. ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోందని తెలిపారు. రాజధానిలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలకు విద్యుత్ అంతరాయం లేకుండా చూసేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందన్నారు.
"ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలలో బ్లాక్‌అవుట్‌లను నివారించడంలో ఈ పవర్ స్టేషన్‌లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి మరియు రాబోయే వేసవి కాలంలో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్, ఆసుపత్రులు మరియు ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరాను నిర్ధారించడానికి కూడా ఇది చాలా అవసరం" అని మంత్రి చెప్పారు. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ దాద్రీ-II, ఝజ్జర్ (ఆరావళి) ప్రధానంగా ఢిల్లీలో విద్యుత్ అవసరాలను తీర్చడానికి స్థాపించబడ్డాయి. అయితే ఈ పవర్ ప్లాంట్‌లలో కూడా చాలా తక్కువ బొగ్గు నిల్వలు ఉన్నాయని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది.
దాద్రీ-II, ఉంచహార్, కహల్‌గావ్, ఫరక్కా, ఝజ్జర్ పవర్ ప్లాంట్స్.. ఢిల్లీకి రోజుకు 1,751 మెగావాట్ల (MW) విద్యుత్‌ను సరఫరా చేస్తాయి. అయితే దాద్రీ-II పవర్ స్టేషన్ నుంచి గరిష్టంగా 728 మెగావాట్లు విద్యుత్ సరఫరా అవుతుండగా, ఉంచహార్ స్టేషన్ నుంచి 100 మెగావాట్ల విద్యుత్ ఢిల్లీకి అందుతుంది. ఇక, దేశవ్యాప్తంగా థర్మల్ ప్లాంట్లు బొగ్గు కొరతతో సతమతమవుతున్నాయని.. ఈ కారణంగా విద్యుత్ సంక్షోభం ఏర్పడుతుందని ఆల్ ఇండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ పేర్కొంది. ఇప్పటికే ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో కరెంట్ కోతలు విధిస్తున్నారు. ఎండలు మండిపోతున్న పవర్ కట్స్‌తో రాజధాని ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
