Asianet News TeluguAsianet News Telugu

బొగ్గు బ్లాకుల కుంభకోణం.. కేంద్ర మాజీ మంత్రికి మూడేళ్ల జైలు...

బొగ్గు కుంభకోణం కేసులో దోషిగా తేలిన కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రేకు సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం శిక్ష ఖరారు చేసింది. ఈ కేసులో దిలీప్ రేకి మూడేళ్ల శిక్ష విధించిన కోర్టు.. ఇద్దరు మాజీ అధికారులు ప్రదీప్ కుమార్ బెనర్జీ, నిత్యానంద్ గౌతంలకు కూడా కోర్టు శిక్ష విధించింది. 

Coal block scam: Former Union Minister Dilip Ray gets 3-year imprisonment - bsb
Author
Hyderabad, First Published Oct 26, 2020, 12:20 PM IST

బొగ్గు కుంభకోణం కేసులో దోషిగా తేలిన కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రేకు సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం శిక్ష ఖరారు చేసింది. ఈ కేసులో దిలీప్ రేకి మూడేళ్ల శిక్ష విధించిన కోర్టు.. ఇద్దరు మాజీ అధికారులు ప్రదీప్ కుమార్ బెనర్జీ, నిత్యానంద్ గౌతంలకు కూడా కోర్టు శిక్ష విధించింది. 

1999 వ సంవత్సరంలో జార్ఖండులో బొగ్గు బ్లాకుల కేటాయింపులో అప్పటి బొగ్గుశాఖ సహాయమంత్రి దిలీప్ రే అక్రమాలకు పాల్పడ్డారని కోర్టు దర్యాప్తులో తేలింది. జార్ఖండు రాష్ట్రంలోని గిరిదిహ్ లోని బ్రహ్మ దిహ బొగ్గు బ్లాకులను1999లో దిలీప్ రే సీటీఎల్ కు కేటాయించారు. దిలీప్ రే అప్పటి అటల్ బిహారి వాజ్ పేయి మంత్రివర్గంలో కేంద్ర సహాయమంత్రిగా పనిచేశారు. దిలీప్ రేతో పాటు మరో ఇద్దరు అధికారులకు కూడా కోర్టు జైలు శిక్ష విధించింది.

ఈ కేసులో దోషులకు శిక్షల ఖరారుపై అక్టోబరు 14న ఇరు వర్గాల వాదనలను విన్న ప్రత్యేక న్యాయస్థానం.. తాజాగా తీర్పు వెలువరించింది. ఝార్ఖండ్‌ గిరిదహ్ జిల్లా బ్రహ్మదిహ బొగ్గు గనులను నిబంధనలకు విరుద్దంగా క్యాస్ట్రన్ టెక్నాలజీకి కేటాయించినట్టు ఆరోపణలు రావడంతో సీబీఐ కేసు నమోదుచేసింది.

ఆ సంస్థకు లీజు కేటాయింపుల్లో అవకతవకలకు పాల్పడినట్టు సీబీఐ దర్యాప్తులో వెల్లడయ్యింది. దీనికి సంబంధించిన ఆధారాలను పక్కాగా సమర్పించడంతో కేంద్ర మాజీ మంత్రి, ఇద్దరు అధికారులను కోర్టు దోషులుగా నిర్ధారించింది. కాగా, బొగ్గు కుంభకోణం కేసులో ఓ కేంద్ర మంత్రి దోషిగా తేలి శిక్ష ఖరారు కావడం ఇదే తొలిసారి. ఇక, 2017 మేలో బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి హరీశ్ చంద్ర గుప్తాకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి భారత్ పరాశర్ తీర్పు వెలువరించారు. ఒక ప్రైవేటు సంస్థకు అక్రమంగా బొగ్గు క్షేత్రాలు కేటాయించినందుకు ఆయనకు ఈ శిక్ష విధించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios