Asianet News TeluguAsianet News Telugu

odisha train accident: అస్తవ్యస్తంగా పడిపోయిన బోగీలు.. భయాకన దృశాలు.. ప్రమాద స్థలంలోని డ్రోన్ విజువల్స్..

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రైలు ప్రమాద స్థలంలోని డ్రోన్ ఫుటేజీని పరిశీలిస్తే ప్రమాద తీవ్రత ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతుంది.

Coaches strewn haphazardly Aerial video captures horror of Odisha train crash ksm
Author
First Published Jun 3, 2023, 12:55 PM IST

బాలాసోర్: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మూడు రైళ్లు (రెండు ప్యాసింజర్, ఒక్క గూడ్స్ రైలు) ప్రమాదానికి గురైన ఘటనలో ఇప్పటివరకు 238 మంది మరణించినట్టుగా రైల్వే అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రమాదంలో  900 మందికి పైగా గాయపడ్డారు. ఈ ప్రమాదాన్ని గత 20 ఏళ్లలో దేశంలోనే అత్యంత ఘోరమైన రైలు ప్రమాదంగా  చెబుతున్నారు. 

రైలు ప్రమాద స్థలంలోని డ్రోన్ ఫుటేజీని పరిశీలిస్తే ప్రమాద తీవ్రత ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతుంది. ప్రమాద సమయంలో రైళ్ల వేగం ఎక్కువగా  ఉండటంతో.. రైలు బోగీలు ఒక దాని ఒకటి ఎక్కినట్టుగా కనిపిస్తుంది. గాల్లోకి లేచి పడిపోయినట్టుగా స్పష్టం అవుతుంది. ఒక రైలు ఇంజన్ కూడా కొన్ని బోగీలపైకి ఎక్కినట్టుగా కనిపిస్తుంది. ప్రమాద తీవ్రత నేపథ్యంలో.. రైలు బోగీల్లో చిక్కుకున్నవారిని బయటకు తీయడం రెస్క్యూ టీమ్స్‌కు తీవ్ర కష్టతరంగా మారింది. గ్యాస్ కట్టర్‌లను ఉపయోగించి బోగీలలో చిక్కుకున్న ప్రయాణికులను రెస్క్యూ సిబ్బంది బయటకు తీస్తున్నారు.

 

 

 

 

 

ఇక, రైలు ప్రమాద ఘటన స్థలంలో యుద్దప్రతిపాదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద స్థలంలో వాతావరణం భీతావహంగా ఉంది. ఎటూ చూసిన మృతదేహాలు.. హృదయవిదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఘటన స్థలాన్ని పరిశీలిస్తే.. బోగీలు ఒకదానిపై ఒకటి ఎక్కడే కాకుండా.. కొన్ని పూర్తిగా  ధ్వంసం అయ్యాయి. కొన్ని బోగీలు కింద పడిపోయే ముందు పూర్తిగా మలుపులు తిరిగాయి. రైలు ప్రమాద స్థలంలో.. రైల్వే ట్రాక్‌లు దాదాపు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

ఇక, ఒడిశాలో రైలు ప్రమాద స్థలాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం పరిశీలించారు. ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి, ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించి, సహాయక చర్యల గురించి ఆరా తీసిన అనంతరం అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇది పెద్ద విషాదకరమైన ప్రమాదం. రైల్వే, ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్, రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతున్నాయి. సాధ్యమైనంత ఉత్తమమైన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు అందించబడతాయి. ఈ ప్రమాదంపై వివరణాత్మక ఉన్నత స్థాయి విచారణ నిర్వహించబడుతుంది. రైలు భద్రతా కమిషనర్ స్వతంత్ర విచారణ కూడా చేస్తారు’’ అని చెప్పారు. ప్రస్తుతం తమ దృష్టి రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్లపై ఉందని తెలిపారు. జిల్లా యంత్రాంగం నుంచి అనుమతి వచ్చిన తర్వాత పునరుద్ధరణ ప్రారంభిస్తామని చెప్పారు. రైలు ప్రమాదానికి గల కారణాలు విచారణ తర్వాత తెలుస్తాయని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కూడా ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు. ఘటన స్థలంలో జరుగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు. అక్కడే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఘటన స్థలంలో జరుగుతున్న సహాయక చర్యలను అధికారులు వారికి వివరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios