రాజ్యాంగ నిర్మాత డా.బిఆర్ అంబేద్కర్ విషయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటలయుద్దం సాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 

లక్నో : డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను మీరంటే మీరు అవమానించారంటూ అధికార బిజెపి, ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి స్పందించారు. అంబేద్కర్ విషయంలో విపక్షాలు మరి ముఖ్యంగా కాంగ్రెస్‌ వ్యవహరించిన తీరును ఆయన తీవ్రంగా ఖండించారు.

సోషల్ మీడియాలో తాజా రాజకీయ పరిణామాలపై యోగి రియాక్ట్ అయ్యారు. డాక్టర్ అంబేడ్కర్ దార్శనికతను సాకారం చేయడంలో బీజేపీ కట్టుబడి ఉందని అన్నారు. కాంగ్రెస్ ఖాళీ మాటలకే పరిమితమైందని, వెనుకబడిన వర్గాల సాధికారతకు చేసిందేమీ లేదని యోగి విమర్శించారు.

బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ సమానత్వ స్వప్నాన్ని సాకారం చేయడానికి బీజేపీ చర్యలు తీసుకుందని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. రిజర్వేషన్ల విస్తరణ, విద్య, ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు కల్పించడం వంటి విధానాల ద్వారా దళిత, వెనుకబడిన వర్గాల సాధికారతకు బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.

డాక్టర్ అంబేడ్కర్ ఆలోచనలను కేవలం ఉపన్యాసాలకే పరిమితం చేయకుండా ఆచరణలో పెడుతున్నామని ముఖ్యమంత్రి యోగి అన్నారు. వెనుకబడిన వర్గాలకు మరిన్ని అవకాశాలు కల్పించడమే కాకుండా, వారిని సమాజంలోని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడంలోనూ బీజేపీ ప్రభుత్వం విజయం సాధించిందని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అభిప్రాయపడ్డారు.