జాతీయ ఐక్యతా దినోత్సవం 2024 : సర్దార్ వల్లభాయ్ పటేల్ కు సిఎం యోగి నివాళి
సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ 'ఐక్యత పరుగు'ను ప్రారంభించారు. ఈ పరుగులో వందలాది మంది యువత, పిల్లలు పాల్గొన్నారు.
స్వాతంత్య్ర భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఆ మహనీయుడి 150వ జయంతిని పురస్కరించుకుని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. లక్నోలోని కాళిదాస్ మార్గ్ నుండి కె.డి సింగ్ బాబు స్టేడియం వరకు 'ఐక్యతా పరుగు' చేపట్టారు... స్వయంగా యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ దీన్పి ప్రారంభించారు.
ఈ ఐక్యత పరుగులో వందలాది మంది యువత, పిల్లలు, పౌరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువతతో ముచ్చటించిన సీఎం యోగి చిన్నారులకు చాక్లెట్లు పంచిపెట్టారు.
ఇక ఇవాళే ధన్వంతరి జయంతి అంటే జాతీయ ఆయుర్వేద దినోత్సవం. ఈ సందర్భంగా యూపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, సామాజిక సాధికారతలో ఆరోగ్య ప్రాముఖ్యతను యోగీ వివరించారు.
"ఆరోగ్యమే సమాజ అభివృద్ధికి మూలం. ఆరోగ్యవంతమైన సమాజం దేశాన్ని బలోపేతం చేస్తుంది. ఐక్యత పరుగు మన ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా, సర్దార్ పటేల్ ఐక్య భారతదేశ దార్శనికతను కూడా బలోపేతం చేస్తుంది" అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమం కేవలం ఐక్యత కోసం పరుగు మాత్రమే కాదు; ఇది ఆరోగ్యం కోసం కూడా. ఇది జాతీయ ఐక్యతకు నిబద్ధతను సూచిస్తుంది, ప్రతి పౌరుడు బలంగా, ఐక్యంగా ఉండటానికి ప్రేరణనిస్తుంది అని ఆయన అన్నారు.
స్వాతంత్య్రం తర్వాతే కాదు ఇప్పటి ఆధునిక భారతదేశ ఐక్యతకు సర్దార్ పటేల్ చేసిన అపారమైన కృషిని చాలా వుందన్నారు. 563 కి పైగా సంస్థానాలను భారత గణతంత్రంలో విలీనం చేయడం ద్వారా బ్రిటిష్ కుట్రను పటేల్ విచ్ఛిన్నం చేశారని సీఎం యోగీ ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.
"జునాగఢ్ నవాబు నుండి హైదరాబాద్ నిజాం వరకు, అందరూ ఐక్య భారతదేశ ప్రాముఖ్యతను గుర్తించేలా చేశారు. సర్దార్ పటేల్ మనకు ఇచ్చిన అఖండ భారత్ దార్శనికత ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో బలోపేతం అవుతోంది" అని ఆయన అన్నారు.
సర్దార్ పటేల్ దూరదృష్టిని యోగీ ప్రశంసించారు. దేశాన్ని ఏకం చేయడంలో ఆయన జ్ఞానం కీలక పాత్ర పోషించిందని నొక్కి చెప్పారు. "ఈ సంవత్సరం, జాతీయ ఐక్యతా దినోత్సవానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సర్దార్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 31, 2024 నుండి అక్టోబర్ 31, 2025 వరకు ఉత్తరప్రదేశ్ తో పాటు దేశవ్యాప్తంగా వరుస కార్యక్రమాలు నిర్వహించబడతాయి" అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమాలు ఐక్యత, సోదరభావాన్ని ప్రోత్సహిస్తాయి, రాష్ట్రవ్యాప్తంగా సర్దార్ పటేల్ ఆదర్శాలను ముందుకు తీసుకువెళతాయన్నారు.
'ఐక్యత పరుగు' సందర్భంగా, దేశ ఐక్యత, సమగ్రతను కాపాడతామని అందరికీ ప్రమాణం చేయించారు సీఎం యోగీ. పౌరులు తమ బాధ్యతలను నెరవేర్చాలని, జాతీయ భద్రతను కాపాడటంలో సైన్యానికి మద్దతు ఇవ్వాలని కోరారు.
ధనత్రయోదశి, దీపావళి, ఛాట్ పండుగల సందర్భంగా ముఖ్యమంత్రి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. సర్దార్ పటేల్ 150వ జయంతిని ఘనంగా జరుపుకోవడం ద్వారా దేశానికి ఆయన చేసిన అపారమైన కృషిని గుర్తుచేసుకున్నారు. "ఈ సందర్భం మనల్ని ఐక్యం చేసి దేశ సేవకు అంకితం చేస్తుంది" అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్, క్రీడలు, యువజన సంక్షేమ శాఖ మంత్రి గిరీష్ చంద్ర యాదవ్, పలువురు ఇతర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.