సారాంశం
ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ కేజ్రీవాల్‌పై తీవ్ర విమర్శలు చేశారు. యమునా కాలుష్యం నుంచి అభివృద్ధి పనుల వరకు పలు అంశాలపై కేజ్రీవాల్‌ను విమర్శించారు.
న్యూ ఢిల్లీ : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ గురువారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన తన మొదటి బహిరంగ సభను కిరాడీ నియోజకవర్గం నుండి బిజెపి అభ్యర్థి బజరంగ్ శుక్లా, రెండవ సభను కరోల్ బాగ్ నుండి దుష్యంత్ గౌతమ్, మూడవ సభను జనక్‌పురి అభ్యర్థి ఆశిష్ సూద్ తరపున నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, అరవింద్ కేజ్రీవాల్ ఆయన విమర్శలు గుప్పించారు.
తన 54 మంది మంత్రులతో కలిసి ప్రయాగ్‌రాజ్‌లోని సంగమంలో స్నానం చేసినట్లు యోగీ ఆదిత్యనాథ్ చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ కూడా తన బృందంతో యమునా నదిలో స్నానం చేయగలరా అని ప్రశ్నించారు. యమునా నదిని మురికి కాలువగా మార్చినందుకు ప్రజలు క్షమించరని అన్నారు. గత ఏడు, ఎనిమిది సంవత్సరాలలో యూపీలో వచ్చిన మార్పుల గురించి కూడా ఆయన ప్రస్తావించారు.
కుంభమేళాలో ఎంతమంది గంగాస్నానం చేసారంటే...
జనవరి 13 (పౌష పూర్ణిమ) నుండి జనవరి 23 వరకు ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న కుంభమేళాకు 10 కోట్ల మంది భక్తులు వచ్చి సంగమ స్నానం చేశారని ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ చెప్పారు. అక్కడ అద్భుతమైన రోడ్లు, విద్యుత్, రైలు, విమాన సౌకర్యాలు ఉన్నాయి.. ఎక్కడా మురికి కనిపించదన్నారు. యూపీ, కేంద్ర ప్రభుత్వాలు కలిసి మహా కుంభమేళా నిర్వహణకు రూ.7500 కోట్లు ఖర్చు చేశాయి. దీనివల్ల యూపీ ఆర్థిక వ్యవస్థలో రూ.2 లక్షల కోట్లకు పైగా వృద్ధి సాధించనుంది. లక్షలాది మంది యువతకు ఉపాధి లభించనుందని సీఎం అన్నారు.
ఢిల్లీ దుస్థితికి కారణం అరవింద్ కేజ్రీవాల్
ప్రస్తుత ఢిల్లీ దుస్థితికి కారణం అరవింద్ కేజ్రీవాల్ అని యోగి అన్నారు. ఎండిఎంసి ప్రాంతాన్ని మినహాయిస్తే మిగిలిన ఢిల్లీలో రోడ్లు, మురుగునీటి పారుదల, పారిశుధ్యం, తాగునీటి పరిస్థితి దారుణంగా ఉందన్నారు. రోడ్డుపై గుంత ఉందా లేక గుంతలో రోడ్డు ఉందా అర్థం కావడం లేదని ఎద్దేవా చేసారు. చెత్తాచెదారం, మురికి కుప్పలుగా పడి ఉన్నాయని... మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోందన్నారు. తాగునీటి కొరత ఏర్పడినప్పుడు ట్యాంకర్ మాఫియా విజృంభిస్తోందని ఆరోపించారు.
ఢిల్లీ ప్రభుత్వం చేసిన పాపం వల్ల మథుర, వృందావన్‌లలోని సాధువులు, భక్తులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. యమునా నది పరిశుభ్రత గురించి ఎప్పుడైనా మాట్లాడితే, కేజ్రీవాల్ అండ్ కంపెనీ సహకరించలేదని యోగి తెలిపారు.
అబద్ధాలు చెప్పడంలో ఆప్ నాయకులు దిట్టలు
ఆమ్ ఆద్మీ పార్టీ ఉదయాన్నే సోషల్ మీడియాలో అబద్ధాల పోస్టులు, వీడియోలు, ప్రకటనలు చేస్తుందని సీఎం యోగీ అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ, దాని నాయకులు అబద్ధాలు చెప్పడానికి ఎంత సమయం వృధా చేస్తారో ఆ సమయాన్ని ప్రజలకు మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కోసం ఆలోచిస్తే పది సంవత్సరాలలో ఢిల్లీ మారిపోయేదన్నారు. కానీ వీళ్ళు ఢిల్లీని చెత్తకుప్పగా మార్చారని ఆవేదన వ్యక్తం చేసారు.
అరవింద్ కేజ్రీవాల్ తన ప్రసంగాలలో ఉత్తరప్రదేశ్ గురించి మాట్లాడుతున్నారు... కానీ ప్రజలు ఇప్పుడు యూపీని ఒక మోడల్‌గా చూస్తున్నారని ఆయన తెలుసుకోవాలన్నారు. ఢిల్లీలో ఓఖ్లా పారిశ్రామిక ప్రాంతం ఉంది, కానీ పది సంవత్సరాలలో ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు కాలేదన్నారు. కొత్త ఓఖ్లాగా నోయిడా అభివృద్ధి చెందిందని యోగి పేర్కొన్నారు. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్ రోడ్లలో భూమి, ఆకాశాల తేడా కనిపిస్తుందని... ఢిల్లీ నుండి ప్రజలు నోయిడా, గ్రేటర్ నోయిడాకు వలస వెళ్తున్నారన్నారు.