కర్ణాటక సీఎం యడియూరప్ప రాజకీయ కార్యదర్శి, బంధువు ఎన్.ఆర్. సంతోశ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. డొల్లార్ కాలనీలో ఆయన నివాసంలో శుక్రవారం నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే గమనించిన కుటుంబీకులు... ఆయన్ను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. 

భర్త ఆత్మహత్య యత్నంపై ఆయన భార్య జాహ్నవి మాట్లాడుతూ.. ‘ నా భర్త సంతోష్‌ కుమార్‌ శుక్రవారం సాయంత్రం చాలా ఆందోళ, బాధతో కనిపించారు. సాయంత్రం 7గంటల సమయంలో ఆయన ఇంటి మేడపైకి వెళ్లారు. నేను సాయంత్రం డిన్నర్‌కు‌ ఏం వండాలో అడుగుదామని మేడపైకి వెళ్లాను. అప్పటికే ఆయన స్పృహ కోల్పోయి అపస్మారక స్థితిలో ఉన్నారు. ఆయన పక్కనే నిద్ర మాత్రలు కనిపించాయి. దీంతో వెంటనే ఆయన్ని స్థానిక అస్పత్రిలో  చేర్పించాం..’’ అని ఆమె తెలిపారు. ఇక తమ కుంటంబం చాలా సంతోషంగా ఉందని, తమకు ఎంటువంటి సమస్యలు లేవని జాహ్నవి వెల్లడించారు. 

ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి  యడ్యూరప్ప  స్పందిస్తూ.. ‘‘శుక్రవారమే సంతోశ్‌తో మాట్లాడా. దాదాపు 45 నిమిషాల పాటు మాట్లాడుకున్నాం. గురువారం కూడా ఆయన ఓ వివాహానికి హాజరయ్యారు. అప్పుడు మామూలుగానే కనిపించారు. ఎందుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారో తెలియదు.’’ అని యడియూరప్ప పేర్కొన్నారు. 

అతని ఆరోగ్యం విషయంలో బాధపడాల్సిన అవసరం లేదని కుటుంబ సభ్యులకు ధైర్యం చేప్పారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా సంతోష్‌ కుమార్‌ తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నట్లు తెలిసింది. ఈ ఏడాది ప్రారంభంలో సీఎం యడ్యూరప్పకి ఆయన రాజకీయ కార్యదర్శిగా నియమితులైన విషయం తెలిసిందే. ఇక ఆయన ఆత్మహత్య యత్నానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.