Rameshwaram Cafe: పేలుడు సంభవించిన బ్యాగ్‌ను ఓ వ్యక్తి వదిలిపెడుతుండగా కనిపించాడు: సీఎం సిద్ధరామయ్య
రామేశ్వరం కేఫ్‌లో పేలుడుకు సంబంధించి సీఎం సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. బ్యాగ్‌లో నుంచి పేలుడు సంభవించిందని, ఆ బ్యాగ్‌ను ఓ వ్యక్తి వదిలిపెడుతుండగా సీసీటీవీ ఫుటేజీలో కనిపించాడని వివరించారు.
Rameshwaram Cafe: బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో పేలుడు ఘటనకు సంబంధించి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. తొలుత ఆ కేఫ్‌లో గ్యాస్ పేలడంతో దుర్ఘటన జరిగినట్టు కొందరు చెప్పారు. కానీ, ఆ తర్వాత అనుమానాలు వచ్చాయి. ఆ గ్యాస్ వద్ద ఎలాంటి పేలుడు సంబంధ సంకేతాలు లేకపోవడంతో అనుమానాలు బలపడ్డాయి. తాజాగా, సీఎం సిద్ధరామయ్య ఇందుకు సంబంధించిన వ్యాఖ్యలు చేశారు. రామేశ్వరం కేఫ్‌లో ఐఈడీ బాంబు పేలిందని ధ్రువీకరించారు. ఓ వ్యక్తి బ్యాగ్‌ను కేఫ్‌లో వదిలిపెట్టి వెళ్లాడని, ఈ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో కనిపించాయని పేర్కొన్నారు. ఆ బ్యాగ్‌లో నుంచే పేలుడు సంభవించినట్టు ఇది వరకే నివేదికలు వచ్చాయి.
రాష్ట్ర హోం మంత్రి ఘటన జరిగిన కేఫ్ దగ్గరికి బయల్దేరాడని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. తన ప్రభుత్వ హయాంలో తొలిసారిగా పేలుడు సంభవించిందని వివరించారు.
శుక్రవారం మధ్యాహ్నం బెంగళూరులోని ప్రముఖమైన రామేశ్వరం కేఫ్‌లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు.