పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోదరుడు కార్తీక్ బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వారసత్వ రాజకీయాలకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రజల స్థితిగతులు మెరుగవ్వాలని చెబుతూ కుటుంబ సభ్యుల అభివృద్ధి కోసం పనిచేసే రాజకీయ నాయకుల పట్ల విసుగొచ్చిందని వ్యాఖ్యానించారు. 

మమతా బెనర్జీని ఉద్దేశించే వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారా అని ఆయనను ప్రశ్నించగా.. సాధారణంగా రాజకీయాల్లో వంచన గురించి నేను మాట్లాడుతున్నా అంటూ తేల్చి చెప్పారు.

రాజకీయాలు ప్రజల స్థితిగతుల్లో మార్పు తీసుకురావాలని కార్తీక్ ఆకాంక్షించారు. ప్రజాసేవలో ఉన్నవారు మన పూర్వీకుల సూచనలు మరిచిపోకూడదని సూచించారు. మొదట ప్రజల గురించి తర్వాతే కుటుంబం గురించి ఆలోచించాలని కార్తీక్‌ బెనర్జీ వెల్లడించారు.

మరోవైపు బీజేపీలో చేరే అవకాశాన్ని ఆయన ఖండించలేదు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదని..  తాను చెప్పాలనుకొనేంత వరకు ఏమీ చెప్పనని కార్తీక్ స్పష్టం చేశారు.

కాగా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ.. బెంగాల్‌ రాజకీయాలు హాట్ హాట్‌గా మారిపోతున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవాలని తృణమూల్ కాంగ్రెస్... ఎలాగైనా బెంగాల్‌లో పాగా వేయాలని బీజేపీ పావులు కదుపుతోంది. ఎన్నికలకు ముందు నుంచి బీజేపీ జాతీయ నాయకులు వరుసగా బెంగాల్‌లో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.