ఓ వస్త్ర దుకాణం.. న్యూ ఇయర్ సందర్భంగా బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆ ఆఫర్ జనాలను బాగా ఆకట్టుకుంది. అంతే... ఆ దుకాణం ముందు జనాలు బారులు తీరారు. ఈ సంఘటన తమిళనాడులోని తిరుత్తణిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... చెలామణిలో లేని 20 పైసల నాణెం తెస్తే టీ షర్ట్‌ ఇస్తామని ప్రకటనతో తిరుత్తణిలోని దుస్తుల దుకాణానికి యువత పోటెత్తారు. నూతన సంవత్సరం సందర్భంగా తిరుత్తణిలోని ఓ రెడీమెడ్‌ షోరూమ్‌ వినూత్న ప్రకటన చేసింది. 

చలామణిలో లేని పాత 20 పైసల నాణెం తెస్తే రూ.300 విలువ చేసే టీషర్ట్‌ ఇస్తామని నిర్వహకులు ప్రకటించారు. అయితే తొలి వందమందికి మాత్రమే ఇస్తామని చెప్పడంతో యువత పెద్ద ఎత్తున దుకాణం ముందు క్యూ కట్టారు. టీ షర్ట్‌ దక్కినవాళ్లు ఆనందం వ్యక్తం చేయగా, దక్కని వాళ్లు నిరుత్సాహంతో వెనుతిరిగారు.