తమిళనాడు ప్రభుత్వం రాష్ట్ర గవర్నర్ అధికారానికి కత్తెర వేయడానికి సిద్ధం అయింది. రాష్ట్రంలో యూనివర్సిటీ వీసీల నియామక అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉండాలని ఓ సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. దీనిపై మాట్లాడుతూ, మోడీ స్వరాష్ట్రం గుజరాత్‌లోనూ వీసీలను గవర్నర్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే నియమిస్తున్నదని వివరించారు. 

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వైస్ చాన్స్‌లర్లను నియమించే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం ఓ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం తమిళనాడులో యూనివర్సిటీలకు వీసీలను నియమించే అధికారం గవర్నర్‌కే ఉన్నది. కానీ, ఈ అధికారానికి కత్తెర వేసి, రాష్ట్ర ప్రభుత్వం వారిని నియమించేలా చట్టాన్ని తేవడానికి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకోసం రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ మంత్రి కే పొన్ముది ఓ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. తమిళనాడు యూనివర్సిటీల
చట్టాన్ని సవరించి వీసీని నియమించే అధికారాన్ని ప్రభుత్వ పరిధిలోకి తెచ్చే బిల్లును ప్రవేశపెట్టారు.

డీఎంకే ప్రభుత్వం తీసుకునే ఈ చర్యను సభ్యులు అందరూ సమర్థించాలని సీఎం ఎంకే స్టాలిన్ కోరారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోడీ స్వరాష్ట్రం గుజరాత్‌తో పోలిక తెచ్చారు. గుజరాత్‌లోనూ విశ్వవిద్యాలయాల ఉపకులపతులను గవర్నర్ నియమించరని, రాష్ట్ర ప్రభుత్వమే నియమిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి సాధారణంగా గవర్నర్ వీసీలను నియమిస్తారని వివరించారు. కానీ, గత నాలుగేళ్లుగా ఒక కొత్త ధోరణి కనిపిస్తున్నదని పేర్కొన్నారు. ఆ అధికారం కేవలం గవర్నర్‌కే చెందినదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇది ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అగౌరవపరిచనట్టు అవుతుందని వివరించారు. ఈ వ్యవస్థ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్‌లో గందరగోళాన్ని సృష్టిస్తున్నదని పేర్కొన్నారు.

కాగా, ఈ బిల్లును ప్రతిపక్ష బీజేపీ వ్యతిరేకించింది. అంతకు ముందే కాంగ్రెస నేత దివంగత సీఎం జయలలితపై చేసిన వ్యాఖ్యలకు అభ్యంతరం తెలుపుతూ ఏఐఏడీఎంకే వాకౌట్ చేసింది. ఈ బిల్లుపై చర్చకు దూరంగా జరిగింది.

ఈ బిల్లుపై చర్చ తర్వాత ఓటింగ్ జరిగాక గవర్నర్‌ వద్దకు వెళ్లనుంది. ఆ తర్వాత అది ఆమోదం కోసం రాష్ట్రపతి వద్దకు చేరుతుంది. రాష్ట్రపతి ఆమోదం తర్వాతే ఆ బిల్లు చట్టరూపం దాల్చనుంది. అయితే, నీట్‌ను వ్యతిరేకిస్తూ తమిళనాడు ఈ పరీక్ష నుంచి మినహాయించాలని తమిళనాడు ప్రభుత్వం పంపిన బిల్లు ఇంకా రాజ్‌భవన్‌లోనే పెండింగ్‌లో ఉన్నది. ఇటీవలి కాలంలో తమిళనాడులోనూ గవర్నర్‌కు సీఎంలకు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఈ క్రమంలో తేనీటి విందుకు గవర్నర్ అందించిన ఆహ్వానాన్ని తమిళనాడు ప్రభుత్వం నిరాకరించింది. ఆ తేనీటి విందును బహిష్కరించింది.

గత కొంతకాలంగా దేశంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసకున్నాయి. ప్రస్తుతం బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న కొన్ని రాష్ట్రాల్లో.. ప్రభుత్వాలకు, గవర్నర్‌లకు మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. ఆయా రాష్ట్రాల గవర్నర్లపై పలు సందర్భాల్లో తమ అసంతృప్తిని వ్యక్తపరిచారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలపై గవర్నర్ ద్వారా కేంద్రం నియంత్రణ ఎందుకని పలు రాష్ట్రాలు ప్రశ్నిస్తున్నారు గవర్నర్లు రాజ్యాంగ పరిమితులను అతిక్రమించి ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నారనే విమర్శలు చేస్తున్నారు. 

మరోవైపు ఆయా రాష్ట్రాలు గవర్నర్‌లు కూడా.. ప్రభుత్వాలు రాజ్యాంగ బద్దంగా వ్యవహరించడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వాలకు గవర్నర్‌లకు మధ్య దూరం పెరుగుతోంది. అధికారిక కార్యక్రమాలకు హాజరు కాకుండా ఉండటం, ప్రోటోకాల్ వివాదం.. ఇలా పలు అంశాలు వారి మధ్య దూరాన్ని మరింతగా పెంచుతున్నాయి.