టీవీ సీరియళ్ల ప్రభావం పిల్లలపై ఎంతగానో చూపిస్తుందనడానికి ఇది ఒక ఉదాహరణ. ఓ టీవీ సీరియల్‌ను చూసి ప్రభావితులై.. డబ్బు కోసం ఆశపడి.. తోటి విద్యార్థులే ఓ బాలుడిని అపహరించి చంపేశారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఈ దారుణం వెలుగు చూసింది. 

పదో తరగతి చదువుతున్న రాజు లోధి అనే బాలుడు ఈ నెల 17న అదృశ్యమయ్యాడు. అనంతరం అతని  స్నేహితుల్లో ఒకడు రాజు తల్లిదండ్రులకు ఫోన్‌చేసి.. అతని ఆచూకీపై తప్పుడు సమాచారం ఇచ్చాడు. తర్వాత రాజు మొబైల్‌నుంచే డబ్బులు అడుగుతూ కూడా అతని తల్లిదండ్రులకు ఫోన్లు వచ్చాయి. 

దీంతో అనుమానం వచ్చిన పోలీసులు రాజు తోటి విద్యార్థులు కొందరిని విచారించగా అదే రోజు చంపేసినట్లు తేలింది. ఈ కేసులో నలుగురు విద్యార్థులను అరెస్టు చేసినట్లు గ్వాలియర్‌ ఎస్పీ తెలిపారు.