తమిళనాడు రాష్ట్రం విల్లుపురంలో దారుణం జరిగింది. కులం పేరుతో దూషించడమే కాకుండా 11 ఏళ్ల బాలుడిని తోటి విద్యార్ధులు నిప్పుల్లోకి నెట్టేశారు. దీంతో ఆ చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు అగ్రవర్ణ బాలురుపై కేసు నమోదు చేశారు.
భారతదేశం అభివృద్ధిలో వెనుకబడటానికి ప్రధాన కారణాల్లో కుల జాడ్యం (caste) ప్రధాన మైనది. అగ్రవర్ణాల వారు నిమ్మ కులాలను అంటరాని వారిగా చూడటం, మితిమీరిన కులాభిమానం కారణంగా భారతదేశం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్‌రామ్, మహాత్మా జ్యోతిభాపూలే, మహాత్మా గాంధీ వంటి మహానీయులు కులాల మధ్య అంతరాలను తొలగించేందుకు తమ జీవితాలనే ధారపోశారు. కానీ నేటికి కుల జాడ్యం మనదేశాన్ని వీడిపోవడం లేదు.
తాజాగా తమిళనాడులో (tamilnadu) అమానవీయ ఘటన చోటు చేసుకుంది. 11 ఏళ్ల బాలుడిని తోటి విద్యార్థులు కులం పేరుతో దూషించి నిప్పుల్లోకి తోసేశారు. వివరాల్లోకి వెళితే.. విల్లుపురం జిల్లాలోని (villupuram) తిండివనంలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించి ముగ్గురు అగ్రవర్ణ బాలురపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. బాధిత బాలుడు తిండివనంలోని కట్టుచివ్రి ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. ఘటనకు బాధ్యులైన బాలురు కూడా అదే స్కూల్ చదువుకుంటున్నారు.
సోమవారం సాయంత్రం నాయనమ్మ ఇంటికి వెళ్లివస్తానంటూ బాధిత బాలుడు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అయితే, కాసేపటికి అతడు ఒంటి నిండా గాయాలతో ఇల్లు చేరాడు. తల్లిదండ్రులు ఏం జరిగిందని ప్రశ్నించగా.. నిప్పులంటుకున్న ముళ్ల పొదల్లో పడ్డానని సమాధానం చెప్పాడు. దీంతో బాలుడిని వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు.
అయితే ఒంటిపై గాయాలకు.. బాలుడు చెబుతున్న దానికి పొంతన కుదరకపోవడంతో అసలేం జరిగిందో చెప్పాలంటూ తల్లిదండ్రులు ఈసారి గట్టిగా ప్రశ్నించారు. దీంతో చిన్నారి మొత్తం పూసగుచ్చినట్లు వివరించారు. స్కూల్‌లో తనతో పాటు చదివే కొందరు అగ్రవర్ణ విద్యార్థులు కులం పేరుతో దూషించారని.. ఈ క్రమంలోనే తాను ఒంటరిగా బయటకు వెళ్లినప్పుడు మరోసారి తిట్టి కొట్టారని, ఆపై నిప్పుల్లోకి తోసేశారని చెప్పాడు. చొక్కాకు మంటలు అంటుకోవడంతో వెంటనే చెరువులోకి దూకి ప్రాణాలు కాపాడుకున్నానని బాలుడు తెలిపారు. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన బాధిత బాలుడి తండ్రి.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ముగ్గురు బాలురపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
