ఒడిశాలోని కంధమాల్ జిల్లాలోని రెసిడెన్షియల్ పాఠశాలల్లో గిరిజన బాలికలు అధిక సంఖ్యలో గర్భం దాల్చడంపై సామాజిక కార్యకర్త రవీంద్ర కుమార్ మిశ్రా జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి)లో పిటిషన్ దాఖలు చేశారు. సెప్టెంబరు 23న గిరిజన బాలిక నాలుగు నెలల గర్భవతి అని తేలడంతో హాస్టల్ వార్డెన్‌ని తొలగించి, మరో రెసిడెన్షియల్ స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. 

నేటీ స‌మాజంలో మ‌హిళ‌లు, చిన్నారుల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింది. కొంత‌మంది మృగాళ్లు ఆడవారు క‌నిపిస్తే చాలు.. చిన్న, పెద్ద‌, ముస‌లి, ముత‌క అనే తేడా లేకుండా కామంతో కొట్టుకున్నారు. అమాయ‌క ఆడపిల్ల‌ల‌పై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. బడి, గుడి, ఇళ్లు, ఆఫీసు, సినిమా హాళ్లు, రెస్టారెంట్లు, బస్ స్టేష‌న్, రైల్వే స్టేషన్లు, క‌దుతున్న‌ బస్సు, కారు, రైళ్లు అనే విచ‌క్ష‌ణ మ‌రిచి.. రెచ్చిపోతున్నారు. నిత్యం ఏదోక చోట అత్యాచార ఘటనలు వెలుగులోకి వ‌స్తున్నాయి. దీంతో చిన్నారులను బయటకు పంపాలంటేనే తల్లిదండ్రులు భ‌య‌ప‌డుతున్నారు. తాజాగా అలాంటి ఘ‌ట‌న‌నే ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో వెలుగులోకి వ‌చ్చింది. 

వివరాల్లోకెళ్తే.. ఒడిశాలోని కంధమాల్ జిల్లా గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న బాలిక గురువారం నాడు మరణించిన శిశువును ప్రసవించింది. త‌న ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఆ త‌రువాత‌ రోజు ప్రాణాలు కోల్పోయింది.

ఎస్సీ/ఎస్టీ విభాగం నిర్వహిస్తున్న కంధమాల్‌లోని ఆశ్రమ పాఠశాలలో సెప్టెంబర్ 23న ఏడో త‌ర‌గ‌తి చదువుకున్న ఓ బాలిక గర్భవతి అని తేలింది, దీంతో షాక్ అయిన ఆ పాఠ‌శాల సిబ్బంది.. పోలీసుల‌కు స‌మాచారమందించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ఆ బాలిక‌ను జిల్లాలోని పిల్లల సంరక్షణా సంస్థలో ఉంచారు. అయితే.. అక్టోబర్ 5 న ఆ బాలిక‌కు పురిటి నొప్పులు వ‌చ్చాయి. అక్క‌డ‌ అత్యవసర ఆరోగ్య‌ సేవలు లేకపోవడంతో అంబులెన్స్‌ను పిలిచారు. అయితే.. అంబులెన్స్ వచ్చే సమయానికి బాలిక మృత శిశువుకు జన్మనిచ్చింది.

ఈ ఘ‌ట‌న‌పై కంధమాల్ జిల్లా బాలల సంరక్షణ అధికారి రష్మితా కరణ్ మాట్లాడుతూ.. తల్లి, బిడ్డ ఇద్దరినీ సమీప సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించామని, అయితే అక్కడికి చేరుకునేలోపే.. శిశువు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించిన‌ట్టు తెలిపారు. గురువారం రాత్రి ఆ బాలిక పరిస్థితి అకస్మాత్తుగా క్షీణించిందనీ, వైద్యులు వెంటనే ఆమెను ఫుల్బానిలోని జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. కానీ అంబులెన్స్ ఏర్పాటు చేసేలోపే ఆమె చనిపోయిందని డీసీపీఓ తెలిపారు.

బాలిక నాలుగు నెలల గర్భవతి అని తేలడంతో, హాస్టల్ వార్డెన్ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ క్రమంలో మరో రెసిడెన్షియల్ స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బాలిక మరణం తరువాత.. బాధితురాలి బంధువులు, ఇతర సంఘం సభ్యులు వైద్యపరమైన నిర్లక్ష్యంగా ఆరోపిస్తున్నారు. ఆమె పరిస్థితి నిలకడగా లేకుంటే బెర్హంపూర్ పట్టణంలోని MKCG మెడికల్ కాలేజీ, ఆసుపత్రి నుండి ఆమెను ఎందుకు తిరిగి తీసుకువచ్చారని నిల‌దీశారు. ఈ ఘ‌ట‌నపై మాజీ ఎమ్మెల్యే కరేంద్ర మాఝీ తీవ్రంగా స్పందించారు. బాలిక మృతికి జిల్లా అధికార యంత్రాంగం కారణమని , కుటుంబానికి ₹ 20 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 

ఇదిలావుండగా, బెర్హంపూర్‌కు చెందిన సామాజిక కార్యకర్త రవీంద్ర కుమార్ మిశ్రా కంధమాల్ వంటి జిల్లాలోని రెసిడెన్షియల్ పాఠశాలల్లో గిరిజన బాలికలు అధిక సంఖ్యలో గర్భిణులు ఉన్నారని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) ముందు పిటిషన్ దాఖలు చేశారు.

ఈ ఏడాది ఆగస్టులో మల్కన్‌గిరి జిల్లాలోని ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని గర్భవతి కావ‌డానికి కార‌ణ‌మైన కాలేజీ విద్యార్థిని అరెస్టు చేశారు. గత ఏడాది డిసెంబర్‌లో.. కంధమాల్‌లోని ఆశ్రమ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న బాలిక ఆరోగ్యం స‌రిగా లేక‌పోవ‌డంతో పరీక్షలు చేయ‌గా.. గర్భవతి అని తేలింది.

దాదాపు 3.3 లక్షల మంది గిరిజన మరియు దళిత బాలికలు SC/ST శాఖ ఆధ్వర్యంలో నడిచే 1,670 ప్రభుత్వ రెసిడెన్షియల్ హాస్టళ్లలో చదువుకుంటున్నారు. గ‌త కొన్ని సంవత్సరాలుగా ఇటువంటి పాఠశాల్లో ఇలాంటి దారుణాలు వెలుగులోకి వ‌స్తునే ఉన్నాయి.