చదుకోవాల్సిన వయసులో.. లెక్కల మీద భయంతో దూరం పెట్టింది. కానీ.... మనసులోపల ఎక్కడో ఆమెలో బాధ ఉండిపోయింది. లెక్కలంటే భయపడకపోయి ఉంటే.. తాను ఉన్నత చదువులు చదివి ఉండేదాన్ని కదా అని. ఆ ఆలోచన ఆమెలో మరో మార్పు తీసుకువచ్చింది. ఎందరికో ఆదర్శంగా నిలపడేలా చేసింది. ముసలిదాన్ని అయిపోయాను.. ఇప్పుడు నాకెందుకు చదువు అని ఆమె అనుకోలేదు. 50ఏళ్ల వయసులో పట్టుపట్టి చదివి 12వ తరగతి పాస్ అయ్యింది.  ఈ సంఘటన మేఘాలయలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మేఘాలయలోని ఓ గ్రామానికి చెందిన లాకింట్యూ  సిమ్లే అనే 50ఏళ్ల బామ్మ 12వ తరగతి పరీక్ష పాసైంది. 1988లో పదో తరగతి చదువుతూ గణితశాస్త్రం అంటే భయంతో చదువు మానేసిన ఆమె.. మళ్లీ 32 ఏళ్ల తరువాత పుస్తకాలు చేతపట్టింది. 

‘2008లో ప్రి-స్కూల్ పిల్లలకు చదువుచెప్పే అవకాశం వచ్చింది. అప్పుడే చదువుతో ప్రేమలో పడ్డా’ అని సిమ్లే చెప్పింది. అందుకే మళ్లీ పుస్తకం పట్టి.. చదివానని ఆమె వివరించారు. కాగా.. తాను ఇక్కడితో చదువును ఆపాలని అనుకోవడం లేదని ఆమె చెప్పారు. ఖాసీ భాషలో బ్యాచిలర్స్ డిగ్రీ చేయాలని ఉన్నట్లు వెల్లడించింది. అదే తన ముందు ఉన్న తదుపరి లక్ష్యం అని ఆమె చెప్పారు.