మణిపూర్‌లో పరీక్ష రాస్తున్న విద్యార్థులు అదనపు సమయం కావాలని డిమాండ్ చేశారు. అందుకు ఉపాధ్యాయులు అంగీకరించకపోవడంతో వారు వాయిలెన్స్‌కు తెగబడ్డారు. సుమారు 8 మంది విద్యార్థులు కంప్యూటర్లు, ఇతర స్కూల్ ప్రాపర్టీపై రాళ్లు విసిరి ధ్వంసం చేశారు.
న్యూఢిల్లీ: ఎగ్జామ్ హాల్‌లో అడుగుపెట్టిన తర్వాత ఇన్విజిలేటర్ సూచనల మేరకు విద్యార్థులు మసులు కోవాలి. ఏ అవసరం ఉన్నా ఇన్విజిలేటర్‌కు విజ్ఞప్తి చేసుకుని తీర్చుకోవాలి. ఎగ్జామ్ హాల్ మొత్తంగా ఆ పరీక్ష అయిపోయే వరకు ఇన్విజిలేటర్ బాధ్యతగా ఉంటుంది. పరీక్షను నిబంధనల ప్రకారం సాగేలా చూడటం అతని బాధ్యత. అందుకే పరీక్ష కాలం ముగియగానే.. విద్యార్థులను వెంటనే రాయడం ఆపేయాలని చెబుతారు. సమయం కాగానే.. ఆన్సర్ షీట్లు కలెక్ట్ చేసుకుంటారు. కానీ, మణిపూర్‌లో టైమ్ అయిపోయింది.. పరీక్ష రాయడం ఆపేయండి.. ఆన్సర్ షీట్లు ఇచ్చేయండి అని ఇన్విజిలేటర్ అనడమే తప్పయిపోయింది. సుమారు ఎనిమిది మంది విద్యార్థులు తమకు మరింత సమయం కావాలని డిమాండ్ చేశారు. కుదరదని స్పష్టం చేయడంతో రాళ్లు విసురుతూ స్కూల్ పై దాడికి దిగారు.
ఈ ఘటన మణిపూర్‌లో తౌబాల్ జిల్లాలో శనివారం చోటుచేసుకున్నట్టు అధికారులు తెలిపారు. యైరిపోక్‌లోని యాక్మె హైయర్ సెకండరీ స్కూల్‌లో జరిగింది. కౌన్సిల్ ఆఫ్ హయర్ సెకండర్ ఎడ్యుకేషన్ మణిపూర్ ప్రతినిధి ప్రకారం, పరీక్ష గడువు ముగియడానికి మరో ఐదు నిమిషాలు మాత్రమే ఉన్నప్పటి నుంచి 12వ తరగతికి చెందిన ఓ విద్యార్థి తమకు మరింత అదనపు సమయం కావాలని ఇన్విజిలేటర్‌ను డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. ‘సమయం ముగిసిందని తెలిపే బెల్ రింగ్ కాగానే కొందరు విద్యార్థులు హింసకు పాల్పడ్డారు. అనేక కారణాలు చెబుతూ తమకు అదనపు సమయం కావాలని డిమాండ్ చేశారు. కంప్యూటర్లు, ఫర్నీచర్ సమా స్కూల్ ప్రాపర్టీపై రాళ్లు విసిరేశారు. వారిని ధ్వంసం చేశారు.’ అని అతను వివరించారు.
ఈ దాడిలో ఓ మహిళా ఉపాధ్యాయిని, 15 మంది విద్యార్థులు గాయపడ్డారని తెలిపారు. వారిని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లి చికిత్స అందించామని వివరించారు. ఆ ఎగ్జామ్ హాల్‌లో మొత్తం 405 మంది విద్యార్థులు పరీక్ష రాశారని తెలిపారు. ఎనిమిది మంది విద్యార్థులు ఈ దాడికి పాల్పడ్డారని చెప్పారు. ఈ దాడిలో క్రియాశీలంగా పాల్గొన్న ఎనిమిది మందిపై పోలీసులకు ఫిర్యాదు అందినట్టు వివరించారు.
