పదో తరగతి బాలికపై తన స్నేహితులు ఇద్దరు మరో ముగ్గురితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంటినుంచి బయటికి వచ్చిన అమ్మాయిని బైక్ మీద హోటల్ కి తీసుకువెళ్లి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. 

ఢిల్లీ : ఢిల్లీ రాజధాని పరీవాహక ప్రాంతంలో దారుణ ఘటన వెలుగుచూసింది. హర్యానాలోని గురుగ్రామ్ లో పదో తరగతి చదువుతున్న బాలికపై శనివారం రాత్రి ఐదుగురు వ్యక్తులు హోటల్ లో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఇద్దరు బాలిక స్నేహితులే ఉండటం గమనార్హం. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పద్నాలుగేళ్ల తన కుమార్తె శనివారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిందని బాధితురాలి తల్లి ఫిర్యాదు చేశారు.

ఇంటి దగ్గరలో ఉన్న పార్క్ కు వాకింగ్ కు వెళ్లి ఉంటుందని మొదట భావించానని.. ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురై వెతకగా.. కనిపించలేదని ఆమె పేర్కొన్నారు. ఆ మరుసటి రోజు ఉదయం 10గంటల సమయంలో ఇంటి సమీపంలో తన కుమార్తెను గుర్తించినట్లు ఆమె ఫిర్యాదులో తెలిపారు. రాత్రంతా ఎక్కడికి వెళ్లావు అని అడగగా.. తన స్నేహితుడు ఇద్దరూ బైక్ పై బయటకు ఎక్కించుకుని హోటల్ కి తీసుకుపోయారని.. వారితో పాటు మరో ముగ్గురు వ్యక్తులు తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు బాలిక తన తల్లికి తెలిపింది.

షాపింగ్‌ మాల్‌లో చాక్లెట్‌ చోరీ చేసిన విద్యార్థిని.. వీడియో వైరల్ కావడంతో ఆత్మహత్య..

ఎక్కడైనా ఈ విషయం చెబితే చంపేస్తామని కూడా బెదిరించారని వాపోయింది. దీంతో బాలిక తల్లి పోలీసులకు ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్నారు. బాధితురాలికి సివిల్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో ఆమెపై అత్యాచారం జరిగినట్టు వైద్యులు ధ్రువీకరించారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై డీసీపీ దీపక్ సహారా మాట్లాడుతూ సోమవారం ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని వారిని విచారిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ కేసులో మిగతా నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.