ఢిల్లీలో మళ్లీ రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవకు సంబంధం ఉన్న 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇది అందరూ ఆందోళన చెందినట్టు మత ఘర్షణ కాదని, మామూలు గొడవే అని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. 

ఈశాన్య ఢిల్లీలోని వెల్‌కమ్ ఏరియాలో రెండు వర్గాల మధ్య బుధవారం రాత్రి ఘర్షణ జరిగింది. ఈ ఘ‌ర్ష‌ణ‌లో దాదాపు 20 మందిని పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. మ‌ళ్లీ ఈ ప్రాంతంలో ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకుండా ఉండేందుకు అదనపు బలగాలను మోహరించాల్సి వచ్చిందని సీనియర్ పోలీసు అధికారి మీడియాతో తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అంద‌గానే వెంట‌నే ఢిల్లీ పోలీసులను అక్క‌డికి పంపించామ‌ని ఆయ‌న చెప్పారు. 

పార్క్ లో అడుకుంటున్న‌ప్పుడు రెండు గ్రూపుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది అల్లర్ల ఘటన కాదని ఒక పోలీసు అధికారి ధృవీకరించారు. ‘‘రెండు గ్రూపులు పార్కులో ఆడుకుంటున్నాయి. ఒక్క సారిగా ఆ గ్రూపులో వారు వాగ్వాదానికి దిగారు. ఇది త్వ‌ర‌లోనే పెద్ద గొడవగా మారింది. దీంతో చాలా మంది ప్రజలు అక్క‌డ గుమిగూడారు. కానీ వారు రెండు ఈ రెండు గ్రూపుల‌ను శాంతింపజేయడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నారు. ఇది అల్లర్లు అని భావించి ప్రజలు పీసీఆర్ కు చాలా సార్లు ఫోన్ చేశారు. కానీ అక్క‌డ అలాంటిదేమీ జ‌ర‌గ‌లేదు ’’ అని ఆయ‌న స్ప‌ష్టం చేశారరు. ఆ ప్రాంతంలో రాత్రి గ‌ట్టి బందోబ‌స్తు ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. 

ఏప్రిల్ 16వ తేదీన వాయవ్య ఢిల్లీలోని జహంగీర్ పూరిలో హనుమాన్ జయంతి ఊరేగింపులో రెండు వ‌ర్గాల మ‌ధ్య మ‌త ఘ‌ర్ష‌ణ‌లు చెల‌రేగాయి. ఈ ఘటనలో 8 మంది పోలీసులు గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధం ఉన్న 41 మందిని ఢిల్లీ పోలీసులు ఇప్ప‌టి వ‌రకు అరెస్టు చేశారు. జహంగీర్ పురి హింసాకాండలో ప్రధాన నిందితుడైన మహ్మద్ అన్సార్ పై దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు.

జహంగీర్ పురిలో ఏప్రిల్ 16న జరిగిన మతఘర్షణల్లో కీలక నిందితుడైన ఫరీద్ అలియాస్ నీలును కూడా ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మత హింసలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) పాత్రపై కూడా భద్రతా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ఈ ఘ‌ట‌న దేశ వ్యాప్తం సంచ‌ల‌నం సృష్టించింది. ఈ నేప‌థ్యంలోనే ఈశాన్య ఢిల్లీలోని వెల్‌కమ్ ఏరియాలో జ‌రిగిన గొడ‌వ కూడా మ‌త ఘ‌ర్ష‌ణలే అనుకొని ప‌ట్ట‌ణ వాసుల్లో ఆందోళ‌న నెల‌కొంది. కానీ పోలీసుల ప్ర‌క‌ట‌న‌తో అలాంటిదేమీ లేద‌ని తేలిపోయింది.