Asianet News TeluguAsianet News Telugu

సుప్రీంకోర్టు చరిత్రాత్మక నిర్ణయం.. హైకోర్టు న్యాయమూర్తుల కోసం ఒకేసారి 68 మంది పేర్లు

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సారథ్యంలోని కొలీజియం దేశవ్యాప్తంగానున్న 12 హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకాలకు 68 మంది పేర్లను కేంద్రానికి సిఫారసు చేసింది. ఏకకాలంలో సుప్రీంకోర్టు ఇంత మంది పేర్లను ప్రతిపాదించడం ఇదే తొలిసారి. ఇందులో 44 మంది బార్ సభ్యులు, మిగతా వారు జ్యుడీషియల్ అధికారులు. 68 మందిలో పది మంది మహిళలు ఉండటం గమనార్హం. మరో రికార్డు ఏమిటంటే మిజోరం రాష్ట్రానికి చెందిన వ్యక్తినీ హైకోర్టు పదోన్నతికి ప్రతిపాదించింది.
 

cji nv ramana led supreme court collegium recommends 68 names for high court judges to centre
Author
New Delhi, First Published Sep 4, 2021, 2:00 PM IST

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మరో చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశంలోని 12 హైకోర్టులకు న్యాయమూర్తులను నియమించడానికి ఏకకాలంలోనే 68 మంది పేర్లను సిఫారసు చేసింది. ఇందులో పది మంది మహిళలు ఉండటం గమనార్హం. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిన్ ఎన్వీ రమణ సారథ్యంలోని ముగ్గురు సభ్యుల కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి ఈ సిఫారసు చేసింది. ఒకేసారి ఇంత మంది పేర్లు ప్రతిపాదించడం సుప్రీంకోర్టు చరిత్రలో ఇదే తొలిసారి.

హైకోర్టుల్లో న్యాయమూర్తులను నియమించడానికి ఆగస్టు 25, ఈ నెల 1న కొలీజియం సభ్యులు సమావేశమై 112 మంది పేర్లను పరిశీలించారు. ఇందులో నుంచి 68 మందిని ఎంపిక చేసి కేంద్రానికి సిఫారసు చేశారు. 68 మందిలో 44 మంది బార్ సభ్యులను ఎంపిక చేసుకోగా మిగతావారు జ్యుడిషియల్ అధికారులు.

న్యాయశాఖ ప్రకారం, ఈ నెల 1వ తేదీనాటికి మొత్తం 25 హైకోర్టుల్లో 465 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక్క అలహాబాద్ హైకోర్టులోనే 68 ఖాళీలున్నాయి. పంజాబ్, హర్యానాలో 40, కలకత్తాలో 36 ఖాలీలున్నాయి.

అలహాబాద్ హైకోర్టు కోసం 16 మందిని, కేరళ హైకోర్టుకు 8 మందిని, కలకత్తా, రాజస్తాన్ హైకోర్టులకు ఆరుగురి చొప్పున నియమించాలని తాజా ప్రతిపాదనలో కొలీజియం పేర్కొంది. వీరితోపాటు గౌహతి, జార్ఖండ్ హైకోర్టుకు ఐదుగురి చొప్పున, పంజాబ్, హర్యానాలకు నలుగురి చొప్పున, చత్తీస్‌గఢ్ హైకోర్టుకు ఇద్దరిని, మధ్యప్రదేశ్ హైకోర్టుకు ఒకరిని నియమించాలని తెలిపింది.

ఈ సిఫారసులో మరో రికార్డు కూడా ఉన్నది. మిజోరం నుంచి తొలిసారిగా హైకోర్టుకు పదోన్నతి కల్పించడానికి ప్రతిపాదించింది. మిజోరం రాష్ట్రానికి చెందిన మర్లి వాంకూంగ్‌ పేరును కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది.

ఆగస్టు 17న తెలంగాణ హైకోర్టు కోసం ఏడుగురి పేర్లను కొలీజియం ఖరారు చేసిన సంగతి తెలిసిందే.

సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంటుంది. అనంతరం రాష్ట్ర రామ్‌నాథ్ కోవింద్ ఈ సిఫారసులకు ఆమోద ముద్ర వేస్తే వారి పదోన్నతులు ఖరారైనట్టుగా భావిస్తారు. రాష్ట్రపతి ఆమోదం తర్వాత వారి ప్రమాణ స్వీకారమే తరువాయి. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు ముందటి సీజేఐ జస్టిస్ ఎస్ఏ బాబ్డే హయాంలో ఒక్కరికీ పదోన్నతి కల్పించకపోవడం గమనార్హం.

అన్నీ అనుకున్నట్టు జరిగితే దేశవ్యాప్తంగా ఉన్న 12 హైకోర్టుల్లో నూతన న్యాయమూర్తులు బాధ్యతలు చేపడుతారు. అలహాబాద్, రాజస్తాన్, కలకత్తా, జార్ఖండ్, జమ్ము కశ్మీర్, మద్రాస్, మధ్యప్రదేశ్, కర్ణాటక, పంజాబ్, హర్యానా, కేరళ, చత్తీస్‌గడ్, అసోం హైకోర్టులకు నూతన న్యాయమూర్తులు వస్తారు.

Follow Us:
Download App:
  • android
  • ios