భారత రాజ్యాంగం స్వయంపాలన, ఆత్మగౌరవం, స్వతంత్రతలతో కూడిన పూర్తి స్వదేశీ సృష్టి అని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగం వలస పాలకులు ఇచ్చింది కాదని అన్నారు.
భారత రాజ్యాంగం స్వయం పాలన, గౌరవం, స్వేచ్ఛ, స్వతంత్రతలతో కూడిన అద్భుతమైన స్వదేశీ సృష్టి అని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. చాలా మంది రాజ్యాంగాన్ని ప్రశంసనీయమైన పదాలలో అర్థం చేసుకుని.. రాజ్యాంగ విలువలను వృత్తి జీవితానికి అన్వయించుకుంటే అపజయం అనేది దరికి చేరబోదని సూచించారు. శనివారం నాడు నాగ్‌పూర్‌లోని మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ మొదటి స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగానికి సంబంధించి అనేక ముఖ్యమైన విషయాలను తెలిపారు.
వలసవాదులు ఇచ్చింది కాదు
ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ మాట్లాడుతూ భారతదేశ వలసవాదులు మనకు రాజ్యాంగాన్ని ఇవ్వలేదని, కానీ దేశ పరిస్థితిని అర్థం చేసుకున్న వ్యక్తులు దీనిని రూపొందించారని అన్నారు. రాజ్యాంగం అద్భుతమైన పురోగతిని సాధించిందని, అయితే ఇంకా చాలా పనులు చేయాల్సి ఉందని, గతంలో ఉన్న లోతైన అసమానతలు ఇంకా మిగిలి ఉన్నాయని, వీటిని మనం పరిష్కరించాల్సి ఉందని ప్రధాన న్యాయమూర్తి అన్నారు.
మౌనంగా ఉండటం వల్ల సమస్యను పరిష్కరించలేమని, దానిపై చర్చించి మాట్లాడటం తప్పనిసరి అని యువ విద్యార్థులు, లా పట్టభద్రులు సూచించారు. యువ న్యాయవాదులు నిర్భయంగా మార్పు కోసం ఉద్యమించి న్యాయ లక్ష్యాన్ని సాధించాలని కోరారు. ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగ విలువలను కాపాడుకోవాలి. సామాజిక, రాజకీయ, ఆర్థిక న్యాయాన్ని తీసుకురావాల్సిన బాధ్యత రాజ్యాంగం కల్పించిందన్న విషయాన్ని మరువలేమనీ, మన హక్కుల కోసం మాట్లాడాలని ఆయన అన్నారు. రాజ్యాంగ విలువలతో మార్గనిర్దేశం చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. గతంలో పాతుకుపోయిన అసమానత నేటికీ ఉందని సీజేఐ అన్నారు.
స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించని తన తీర్పును ఉటంకిస్తూ.. మనం చాలా సాధించామని, అయితే సమకాలీన సమాజంలో అన్ని రకాల వివక్షలు, ప్రాచీన పద్ధతులను తొలగించడానికి ఇంకా చాలా సాధించాల్సిన అవసరం ఉందని సూచించారు. లా గ్రాడ్యుయేట్‌లు తమ వ్యక్తిగత, వృత్తి జీవితంలో రాజ్యాంగాన్ని మార్గదర్శకంగా పరిగణించాలని ఉద్బోధిస్తూ.. వ్యవస్థాపక తండ్రులు నిర్దేశించిన ఉన్నతమైన లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని అన్నారు.
న్యాయవాదులు న్యాయం, దాతృత్వం మధ్య తేడాను గుర్తించాలని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. “మనం దాతృత్వం చేయడం ద్వారా ఒకరి బాధను క్షణకాలం తుడిచివేయవచ్చు. కానీ ఇలా చేయడం ద్వారా.. అతనికి న్యాయం చేసే హక్కును కోల్పోతాము. కాబట్టి.. మన పోరాటం కేవలం దాతృత్వం మాత్రమే కాదు, న్యాయం జరిగేలా చూడాలని ఆయన అన్నారు.
అలాగే రాజ్యాంగంలోని పీఠిక గురించి ప్రస్తావిస్తూ.. పీఠిక రాజ్యాంగంలో చిన్న భాగమని, అయితే అది బరువైన భాగమని అన్నారు. ఇందులో "భారత ప్రజలమైన మనమే ఈ రాజ్యాంగాన్ని మనకే ఇస్తున్నాం" అని చెప్పబడింది. ఇది చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఇది భారతదేశ ప్రజల స్థితి నుండి పౌరుల స్థితికి మారడాన్ని సూచిస్తుంది. వలసవాదులు మనకు రాజ్యాంగాన్ని దయగా ఇవ్వలేదనీ, మన రాజ్యాంగం స్వయం పాలన, గౌరవం, స్వేచ్ఛలతో కూడిన స్వదేశీ ఉత్పత్తి అని వ్యాఖ్యానించారు.
రాజ్యాంగం ఆవిర్భవ సందర్భంలో.. అది గొప్పగా ఏమీ లేదు. మరింత న్యాయమైన , ప్రజాస్వామ్య సమాజాన్ని సృష్టించే దిశగా రాజ్యాంగం సుదీర్ఘ అడుగులు వేసిందని ఆయన అన్నారు. కానీ చాలా పని చేయాల్సి ఉంది. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు మన సమాజంలో పాతుకుపోయిన అసమానత నేటికీ ఉందనీ, దీనిని అధిగమించడానికి, మన సమాజంలో రాజ్యాంగంపై అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు.
డా. భీమ్‌రావ్ అంబేద్కర్ (సమాజంలో) ఎదుర్కొన్న సమస్యల గురించి జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ.. భారతదేశ ప్రజలు ఆయనకు నిత్యం రుణపడి ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సీజేఐ శరద్ బాబ్డే, సిట్టింగ్ ఎస్సీ జడ్జి భూషణ్ గవాయ్, బాంబే హైకోర్టు తాత్కాలిక సీజే సంజయ్ జీఏ గపూర్వాలా, వీసీ విజయేందర్ కుమార్, పలువురు న్యాయ ప్రముఖులు పాల్గొన్నారు.
