నిన్న ఆదివారం జరిగిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష రాయలేకపోయానని మనస్థాపానికి గురైన ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన దేశ రాజధాని డిల్లీలో చోటుచేసుకుంది.  

ఈ ఆత్మహత్యకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. డిల్లీలోని రాజేంద్ర నగర్ లో ఓ యువకుడు గతకొన్ని రోజులుగా సివిల్స్ కి ప్రిపేరవుతున్నాడు. అదే ప్రాంతంలో ఓ రూం ను అద్దెకు తీసుకుని ఒంటరిగా ఉంటూ పరీక్షకు ప్రిపేరవుతున్నాడు. 

అయితే నిన్న ఆదివారం రోజున యూపీఎస్సీ దేశవ్యాప్తంగా  సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ యువకుడు ఉత్తర డిల్లీలోని పహర్గంజ్ పరీక్ష కేంద్రంలో ప్రిలిమినరీ పరీక్ష రాయడానికి వెళ్లాడు. వివిద కారణాలతో నిర్ణీత సమయం కంటే కాస్త ఆలస్యంగా వెళ్లాడు. దీంతో నింబంధనల ప్రకారం అధికారులు అతడిని పరీక్షకు అనుమతించలేదు.

ఇలా పరీక్ష రాయకపోవడంతో యువకుడు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఎగ్జామ్ సెంటర్ నుండి నేరుగా తన రూంకి చేరుకున్న యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు అతడి రూంను పరిశీలించగా ఓ సూసైడ్ లెటర్ దొరికింది. ఎంతో కష్టపడి గత కొన్ని రోజులుగా సివిల్స్ కి ప్రిపేరవుతుంటే ఇలా పరీక్ష రాయకపోవడం వల్లే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు మృతుడు లెటర్ లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.