పెళ్లి అనగానే ముందుగా అందరికీ గుర్తు వచ్చేది కట్నమే. ఎంత కట్నం ఇస్తున్నారంటూ అందరూ ఆరా తీస్తారు. ఇంట్లో ఆడపిల్ల ఉందంటే తల్లిదండ్రులు కూడా ముందు నుంచే అమ్మాయి కట్నం కోసం పొదుపు చేయాలని అనుకుంటారు. ఇక అబ్బాయి కుటుంబసభ్యులైతే మా అబ్బాయికి ఇంత కట్నం కావాల్సిందే అని డిమాండ్ చేసేవాళ్లు కూడా ఉన్నారు. కట్నం ఇవ్వడం, తీసుకోవడం నేరమని పోలీసులు చేబుతున్నా... వాటిని పట్టించుకోకుండా ఇచ్చుకోవడాలు, పుచ్చుకోవడాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే.. ఓ పెళ్లి కొడుకు మాత్రం కాబోయే అత్తమామలు.. రూ.11లక్షల కట్నం ఇస్తామని చెప్పినా.. వద్దు అంటూ సున్నితంగా నిరాకరించాడు. ఈ సంఘటన జైపూర్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. జైపూర్‌ కు చెందిన జితేంద్ర సింగ్‌.. సెంట్రల్ ఇండస్ట్రియల్ ఫోర్స్  (CISF) జవానుగా పని చేస్తున్నాడు. ఇతను ఒక అమ్మాయిని నవంబర్ 8వ తేదీన వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లి సమయంలో అమ్మాయి తల్లిదండ్రులు కట్నం కింద వరుడికి రూ. 11 లక్షలు ఇస్తుంటే... వరుడు వెంటనే వద్దనేశాడు.

వధువు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆఫ్ లా పూర్తి చేసింది. ప్రస్తుతం డాక్టరేట్ చేస్తుంది. అంతేకాకుండా రాజస్థాన్‌ జ్యుడిషీయల్‌ సర్వీసెస్‌కు ప్రిపేర్‌ అవుతుంది. ఒక వేళ ఆమె జ్యుడిషీయల్‌ సర్వీసెస్‌లో ఉద్యోగం సంపాదిస్తే.. అదే మాకు పెద్ద సంపాదన, ఈ డబ్బు మాకు వద్దు అని వరుడు పేర్కొన్నాడు. దీంతో వదువు తండ్రికి సంతోషంతో కన్నీళ్లు వచ్చాయి. వాళ్లను కేవలం సంతోషపెట్టడానికి రూ.11 తీసుకున్నాడు. అతను మంచితనానికి అందరూ ఫిదా అయిపోయారు. పెళ్లి కి వచ్చిన బంధువులు  కూడా వరుడిపై ప్రశంసలు కురిపించారు.

అమ్మాయి తండ్రి మాట్లాడుతూ.. మాకు కాబోయే అల్లుడు తనకు ఇచ్చిన డబ్బును వద్దని చెప్పడంతో నేను చాలా బయపడ్డాను, కాసేపటి వరకు షాక్ లో ఉండిపోయానని అమ్మాయి తండ్రి గోవింద్ సింగ్ అన్నారు. కట్నం తీసుకోకపోయేసరికి కొంచెం ఇబ్బంది కలిగింది. పెళ్లి ఏర్పాట్లు సరిగా చేయనందుకు కట్నం వద్దంటున్నారని అనుకున్నాం. కానీ వరుడి కుటుంబం కట్నం తీసుకోటానికి ఇష్టపడట్లేదని తెలిసి చాలా సంతోషంగా అనిపించిందని గోవింద్‌ సింగ్‌ చెప్పాడు.