Asianet News TeluguAsianet News Telugu

హవానా సిండ్రోమ్.. కొత్త యుద్ధ తంత్రమా?.. రష్యా దాడి?.. భారత పర్యటనలో సీఐఏ అధికారులకు ఇదే సోకిందా?

హవానా సిండ్రోమ్ గురించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. భారత పర్యటనలో అమెరికా నిఘా విభాగం సీఐఏ అధికారులకు ఈ సిండ్రోమ్ సోకిందనే వార్తలు వస్తున్నాయి. కానీ, అటు అమెరికా, ఇటు భారత ప్రభుత్వం దీనిపై నోరువిప్పడం లేదు. 2016లో తొలిసారి అమెరికా దౌత్య సిబ్బందిలో కనిపించిన ఈ సిండ్రోమ్ రష్యా కనిపెట్టిన కొత్త సోనిక్ వెపన్ అనే వాదనలు తెరమీదకు వచ్చాయి. 

cia personnel affected with havana syndrom while in india tour
Author
New Delhi, First Published Sep 21, 2021, 1:24 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

న్యూఢిల్లీ: ఇప్పుడు అమెరికా, వియత్నాం, భారత్ సహా పలు దేశాల్లో హవానా సిండ్రోమ్ చర్చనీయాంశమవుతున్నది. అమెరికా నిఘా సంస్థ సీఐఏ చీఫ్ విలియం బర్న్స్‌తోపాటుగా భారత పర్యటన చేసిన అధికారుల్లో ఈ సిండ్రోమ్ లక్షణాలు కనిపించినట్టు అమెరికా మీడియా రిపోర్ట్ చేసింది. ప్రస్తుతం వారికి మెడికల్ ట్రీట్‌మెంట్ అందిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటి వరకు 200 మంది దాకా అమెరికా సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు హవానా సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్టు సమాచారం. ఈ సిండ్రోమ్‌పై అటు అమెరికా, ఇటు భారత్, ఇతర దేశాలూ పెదవి విప్పడం లేదు. అయితే, ఒసామా బిన్ లాడెన్ వంటి కరడుగట్టిన ఉగ్రవాదిని కనిపెట్టిని సీఐఏ సీనియర్ అధికారులతో ఆ సంస్థ చీఫ్ ఓ నిపుణుల కమిటీ వేసి దీని మూలాలను కనిపెట్టాలని ఆదేశించినట్టు తెలిసింది. అంతటి సీనియర్ అధికారులతో ఈ సిండ్రోమ్ మూలాలు కనుగొనాలని సీఐఏ నిర్ణయించుకోవడం చర్చను లేపింది. కొందరు దీన్ని సరికొత్త యుద్ధ తంత్రమని చెబుతున్నారు. అందుకూ కొన్ని సిద్ధాంతాలను ప్రస్తావిస్తున్నారు.

హవానా సిండ్రోమ్ కారణంగానే వియత్నాం పర్యటించే అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ తన పర్యటనను కొద్దిసేపు వాయిదా వేసినట్టు కథనాలు వచ్చాయి. ఇంతకీ హవానా సిండ్రోమ్ ఏమిటి? ఎప్పుడు? ఎక్కడ? వెలుగు చూసిందో వివరాలు పరిశీలిద్దాం..

హవానా సిండ్రోమ్ లక్షణాలు: 
హవానా సిండ్రోమ్ బారినపడ్డ వ్యక్తి జ్ఞాపకశక్తి, చూపు మందగిస్తుంది. విషయాలను గుర్తుపెట్టుకోవడానికి స్ట్రగుల్ పడుతుంటారు. వినికిడి శక్తి లోపిస్తుంది. కడుపు తిప్పినట్టు అవుతుంది. ‘సెన్స్’ శక్తి మందగిస్తుంది. కండరాల్లో పటుత్వం దెబ్బతింటుంది. అలసట, శరీరంతా నొప్పిగా ఉంటుంది. తలనొప్పీ ఉంటుంది.

ఈ సిండ్రోమ్ తొలిసారి 2016లో క్యూబాలో వెలుగుచూసింది. అది కూడా అప్పుడు అక్కడ పనిచేస్తున్న అమెరికా దౌత్య సిబ్బందిలో మాత్రమే కనిపించింది. ఒక్కసారిగా అందరూ దీని బారినపడటంతో ఏదో కీడు శంకించిన అమెరికా వెంటనే దాదాపు సగం మంది సిబ్బందిని వెనక్కి తీసుకుంది.

బాంబ్ బ్లాస్ట్‌కు సమానమైన డ్యామేజీ:
హవానా సిండ్రోమ్ కారణంగా మెదడు కణాలు తీవ్రంగా నష్టపోయినట్టు తెలిసింది. వినికిడి శక్తి లోపించడం వంటి లక్షణాలతోపాటు అప్పుడు వారి మెదడును స్కాన్ చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. హవానా సిండ్రోమ్‌తో బ్రెయిన్ టిష్యూ దారుణంగా దెబ్బతింటున్నాయని తేలింది. ఒక కార్ యాక్సిడెంట్‌లో లేదా బాంబ్ బ్లాస్ట్‌లో బాధితుడి మెదడు కణాలకు సమానంగా ఈ సిండ్రోమ్ కారణంగా దెబ్బతింటున్నాయని తేల్చారు.

ఇది రష్యా కనిపెట్టిన దాడేనా?
ఇది ఒక సోనిక్ వెపన్ అని, బహుశా రష్యా కనిపెట్టిన ఒక కొత్త ఆయుధంగా అమెరికా అధికారులు భావించారు. హవానా సిండ్రోమ్‌ను ధ్వని తరంగాలతో రేపారని విశ్లేషించారు. కానీ, చెవికి వినిపించని తరంగాల ద్వారా ఇది సాధ్యపడదని మరికొందరు నిపుణులు వాధించారు. తర్వాత మైక్రోవేవ్ ద్వారా ఈ సిండ్రోమ్‌ను కలిగించి ఉండొచ్చని ఇంకో థియరీ వచ్చింది. దీనిపైనే నేషనల్ అకడమి్ ఆఫ్ సైన్సెస్, ఇంజినీరింగ్ అండ్ మెడిసిన్(నాసెమ్) ఓ రిపోర్ట్ పబ్లిష్ చేసింది. సూక్ష్మ తరంగాలు మెదడు పనితీరును ప్రభావితం చేయవచ్చునని, లక్షణాలతోపాటు వివరించింది. జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ కూడా ఇదే నిర్ధారణకు వచ్చింది. రష్యా 1950 నుంచే మైక్రోవేవ్ టెక్నాలజీపై ప్రయోగాలు చేస్తున్నట్టు ఈ రిపోర్టులు తెలిపాయి. మాస్కోలోని అమెరికన్ ఎంబసీలో సోవియట్ యూనియన్ ఒకప్పుడు మైక్రోవేవ్ టెక్నాలజీతోనే బ్లాస్ట్ చేసిందనే ఆరోపణలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హవానా సిండ్రోమ్ ఒక కత్త యుద్ధ తంత్రంగా చెబుతున్నారు. అయితే, మరికొందరు మాత్రం మానసిక ఒత్తిళ్లతో ఒకే కార్యసాధనకు పనిచేస్తున్న గుంపులో ఇలాంటి లక్షణాలు ఏర్పడే అవకాశముందనీ చెబుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios