మహాబలిపురం: చైనాలోని వుహాన్ నగరంలో జరిగిన తొలి భేటీ తరువాత చైనా అధ్యక్షుడు భారత్ లోని మహాబలిపురం లో పర్యటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ అనధికారిక పర్యటనను చెన్నై కనెక్ట్ పేరుతో వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే. 

రెండు రోజుల పాటు సాగనున్న ఈ భేటీకోసం నిన్న శుక్రవారం నాడు పల్లవుల నగరం మామల్లాపురం చేరుకున్న జిన్ పింగ్ శనివారం ప్రధాని మోడీతో విస్తృతమైన చర్చలు జరపనున్నారు. 

ఈ పల్లవుల నగరాన్ని ఇరుదేశాధినేతల సమావేశానికి వేదికగా ఎంచుకోవడానికి కారణం కూడా లేకపోలేదు. చైనా సిల్క్ రూట్ లో ఈ పల్లవుల రాజధాని మామల్లాపురానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక్కడి నుండి దక్షిణాసియా దేశాలకు ఎగుమతులు, అక్కడినుంచి దిగుమతులు జరిగేవి. 

ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మాట్లాడుతూ, ఈ పర్యటనను తానెన్నటికి మరువలేనన్నాడు. ఈ ఆతిథ్యం ఆయనను, ఆయన సిబ్బందిని మైమరిచిపోయేలా చేసిందని జిన్ పింగ్ అన్నారు. ఈ పర్యటన తన జీవితాంతం ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుందని జిన్ పింగ్ అభిప్రాయపడ్డాడు. 

భారత ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినట్టు ఇరు దేశాల మధ్య స్నేహపూర్వకమైన వాతావరణంలో చర్చలు సాగాయని, ఇవి ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత దృఢపరుస్తాయన్న అభిప్రాయాన్ని జిన్ పింగ్ వెలిబుచ్చారు. 

ఈ చర్చల అనంతరం కోవాలం బీచ్ రిసార్ట్ లో నేటి రాత్రి ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చే విందుకు హాజరవుతారు. ఈ విందులో అనేక అంశాలపై ఇరు నేతలు చరించనున్నారు. ఈ కార్యక్రమంతో చైనా అధ్యక్షుడి పర్యటన ముగుస్తుంది.