చైనా నుంచి అరేబియా సముద్రం మీదుగా యూఏఈ వెడుతున్న నౌకలోని వ్యక్తికి బుధవారం రాత్రి కార్డియాక్ అరెస్ట్ అయింది. భారత కోస్ట్ గార్డ్ రెస్క్యూ సిబ్బందికి సమాచారం అందడంతో సాహసోపేతంగా రక్షించారు.
నౌకలో ప్రయాణిస్తుండగా ఓ వ్యక్తికి సడన్ గా కార్డియాక్ అరెస్ట్ అయ్యింది. దీంతో భారత కోస్ట్ గార్డ్ సిబ్బంది ప్రతిప్రతికూల వాతావరణాన్ని లెక్కచేయకుండా అతడిని ఏర్ లిఫ్ట్ చేసి సాహసోపేతమైన ఆపరేషన్తో ఆస్పత్రికి తరలించింది. నడి సముద్రంలో నౌకలో ప్రయాణిస్తున్న ఓ చైనా వ్యక్తి తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. చుట్టూ చిమ్మ చీకటి, పోటెత్తుతున్న అలల మధ్య ఇండియన్ కోస్ట్ గార్డ్ అతడిని ఎయిర్ లిఫ్ట్ చేసి ఆసుపత్రికి తరలించింది.
దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే.. ఎంబీ డాంగ్ ఫాంగ్ కాన్ టాన్ నెంబర్ 2 రీసెర్చ్ నౌక పనామాపతాకంతో ఉంది. ఈ నౌక చైనా నుంచి అరేబియా సముద్రం మీదుగా యూఏఈ వెళుతోంది. ఈ నౌకలో యిన్ వీగ్ యాంగ్ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. అతనికి బుధవారం రాత్రి కార్డియాక్ అరెస్ట్ అయింది. ఛాతిలో నొప్పితో విలవిలలాడుతూ ఉండిపోయాడు.
ఇది గమనించిన నౌకలోని సిబ్బంది సమీప తీర ప్రాంతమైన ముంబైలోని మారిటైం రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్కు సహాయం కావాలంటూ మెసేజ్ పంపించింది. ఈ మెసేజ్ ను చూసి భారత కోస్ట్ గార్డ్ సిబ్బంది అప్రమత్తమయ్యింది. వెంటనే బాధితుడిని అత్యవసరంగా ఆసుపత్రికి చేర్చాలని రంగంలోకి దిగింది.
ఏఎల్హెచ్ ఎంకె 3 హెలికాప్టర్ తో కోస్ట్ గార్డ్ సిబ్బంది బయలుదేరారు. ఆ సమయంలో చైనా నౌక అరేబియా సముద్రంలో తీరానికి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. అయినా కూడా కోస్ట్ గార్డ్ సిబ్బంది చిమ్మ చీకట్లోనే ధైర్యంగా ఈ ఆపరేషన్ కు ముందుకు దూకింది.
అర్ధరాత్రి పూట నౌక సమీపానికి చేరుకున్న సిబ్బంది.. నౌకలోని వీగ్ యాంగ్ ను ఎయిర్ లిఫ్ట్ చేసింది. హెలికాప్టర్ లోనే ప్రధమ చికిత్స చేసి… ఆసుపత్రికి తరలించింది. ఈ మేరకు భారత రక్షణ శాఖ గురువారం ప్రకటనలో వెల్లడించింది.
