గాల్వాన్ లోయలో చైనా దురాగతాలకు, వారి దుష్టనీతికి 20 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. భారతీయ సైనికులపై పన్నాగం ప్రకారం రాడ్లు, ఇనుప చువ్వలు గుచ్చిన కర్రలతో దాడిచేసిన విషయం తెలిసిందే. 

చైనీయుల దురాగతం వల్లే భారతీయ సైనికులు మరణించారనేది అక్షర సత్యం. అయినప్పటికీ చైనా మాత్రం తన వితండ వాదనను కొనసాగిస్తూనే ఉంది. చైనా సైనికులు ముందుగా దాడులకు పాల్పడలేదని, భారతీయ సైనికులే ముందుగా చైనా సైనికులను రెచ్చగొట్టారని చైనా ప్రభుత్వం భారత్ పై బురద చల్లే ప్రయత్నాలను చేస్తుంది. 

ఈ ఘోరమైన ఘటన తరువాత ఇది దురదృష్టం అని పేర్కొంటూ... చైనా భారత్ తో చర్చలకు అంగీకరించింది. ఇప్పటికే ఉన్నతాధికారుల మధ్య చర్చలు కూడా మొదలయ్యాయి. ఇలా చర్చలు జరుపుతుండగానే భారతదేశంపై బురదచల్లుతూ  దుష్టనీతికి పాల్పడుతోంది చైనా. 

భారత్- చైనా సరిహద్దు వెంట గత కొన్ని రోజులుగా స్వల్ప ఉద్రిక్తతలు చేసుకుంటున్నాయి. అయితే ఈ నెల మొదటి వారంలో అవి మరింత తీవ్రమయ్యాయి.

ఈ నేపథ్యంలో జూన్ 6వ తేదీన లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారుల మధ్య చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా గాల్వన్ లోయలో నిర్మించిన తాత్కాలిక చెక్‌పోస్టులను తొలగించడానికి, చైనా అంగీకరించింది.

అయితే చైనా ఎంతమేరకు తన మాట నిలబెట్టుకుందో చూసేందుకు కల్నల్ సంతోష్ బాబు నేతృత్వంలోని 40 మంది జవాన్లు జూన్ 15న సాయంత్రం గాల్వన్ లోయలోకి వెళ్లారు. ఈ క్రమంలో భారత భూభాగంలో చైనా సైన్యం అబ్జర్వేషన్ పోస్ట్ నిర్మించినట్లు గుర్తించారు.

అంతేకాకుండా అక్కడ తనకు తెలిసిన చైనా సైనికులు కాకుండా కొత్త ముఖాలు ఉండటాన్ని సంతోష్ గుర్తించారు. దీంతో డ్రాగన్ దేశం.. అదనపు బలగాలను మోహరించిందని పసిగట్టిన సంతోష్ బాబు అక్కడి నిర్మాణాలను తొలగించాలని సూచించారు.

అదే సమయంలో ఓ సైనికుడు మాండరిన్ భాషలో దూషిస్తూ సంతోష్‌ను బలంగా వెనక్కి తోశారు. తమ దళపతిపై చైనా సైనికుడు చేయి చేసుకోవడాన్ని సహించలేకపోయిన భారత బలగాలు చైనా సైన్యంపై దాడికి దిగాయి.

ఈ క్రమంలో అరగంట పాటు ఇరు వర్గాలు తలపడటంతో ఇరువైపులా సైనికులు గాయపడ్డారు. ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడినప్పటికీ అక్కడి నుంచి వెనక్కి వెళ్లకుండా గాయపడిన సైనికుల స్థానంలో అదనపు బలగాలను రప్పించారు.

ఆ కాసేపటికే చైనా సైనికులు భారీగా అక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే చైనా సైనికులు భారీ సంఖ్యలో మేకులున్న ఇనుప రాడ్లు, కర్రలు, రాళ్లతో దాడికి దిగారు. రాత్రి 9 గంటల ప్రాందంలో సంతోష్ బాబు తలకు గాయం కావడంతో ఆయన గాల్వన్ నదిలో పడిపోయారు.

దీంతో భారత జవాన్లలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అంతే చైనా సైన్యాన్ని ధీటుగా ఎదుర్కొన్నారు. ఘర్షణ ముగిసిన తర్వాత కల్నల్ సంతోష్‌తో పాటు ఇరు దేశాలకు చెందిన సైనికుల మృతదేహాలు గాల్వన్ నదిలో పడిపోయాయి.