బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జనతాదళ్‌ (యునైటెడ్‌) పార్టీ జాతీయ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. నూతన అధ్యక్షుడిగా ఆర్‌సీపీ సింగ్‌ (రామచంద్ర ప్రసాద్‌ సింగ్‌) నియమితులయ్యారు.

ఈ మేరకు ఆదివారం జరిగిన జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అధ్యక్షుడిగా రాజ్యసభ సభ్యుడైన ఆర్‌సీపీ సింగ్‌ పేరును నీతీశ్‌ ప్రతిపాదించగా.. పార్టీ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.  

యూపీ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి అయిన ఆర్‌సీపీ సింగ్‌.. నీతీశ్‌ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. నీతీశ్‌ సీఎం అయిన తర్వాత ప్రిన్సిపల్‌ సెక్రటరీగా వ్యవహరించారు.

ఆ తర్వాత ప్రజాసేవ చేయాలనే ఉద్దేశ్యంతో రాజకీయాల్లోకి వచ్చారు. ఈ క్రమంలో జేడీయూ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. సీఎం నీతీశ్‌ కుమార్‌కు రామచంద్ర అత్యంత నమ్మకస్తుడిగా, సన్నిహితుడిగా పేరొందారు.

ప్రస్తుతం జేడీయూ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి 2019లో మూడేళ్ల కాలానికి నీతీశ్‌ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అయినప్పటికీ మధ్యలోనే నితీశ్ పార్టీ బాధ్యతలను సింగ్‌కు అప్పగించారు.

కాగా, ఇటీవల అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఆరుగురు జేడీయూ సభ్యులు బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ అంశం ప్రధానంగా తాజా సమావేశంలో చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది.