న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఎన్వీ రమణ పేరును  ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే ప్రతిపాదించారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖకు, రాష్ట్రపతికి ఆయన లేఖ రాశారు.ఈ ఏడాది ఏప్రిల్ 23న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బోబ్డే రిటైర్ కానున్నారు. సుప్రీంకోర్టులో సీనియర్ జడ్జిగా ఎన్వీరమణ కొనసాగుతున్నారు. 

 

సుప్రీంకోర్టు జడ్జిగా ఎన్వీరమణ 2014 ఫిబ్రవరి 17న బాధ్యతలు చేపట్టారు. 2022 ఆగష్టు 26వ తేదీన రమణ రిటైర్ కానున్నారు.సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఎస్ఏ బోబ్డే 2019 నవంబర్ 18న బాధ్యతలు స్వీకరించారు.రంజన్ గోగోయ్ తర్వాత బోబ్డే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు స్వీకరించారు.సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా రమణ బాధ్యతలు చేపడితే 2022 ఆగష్టు 26 వరకు ఆ పదవిలో ఉంటారు.

సాధారణ వ్యవసాయ కుటుంబంలో రమణ జన్మించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎన్వీ రమణ అంచెలంచెలుగా ఎదిగారు. కృష్ణా జిల్లా పొన్నవరంలో 1957 ఆగష్టు 27న జస్టిస్ ఎన్వీ రమణ జన్మించారు.1983లో ఆయన న్యాయవాద వృత్తిని చేపట్టారు. 

 2000లో ఏపీ హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తిగా ఆయన నియమితులయ్యారు. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టుకు చీఫ్ జస్టిస్ గా పనిచేశారు. 2014 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టుకు ఆయన పదోన్నతిపై వెళ్లారు. సీజేఐగా ఎన్వీ రమణ బాధ్యతలు చేపడితే 16 మాసాలపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.