తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసి.. ఎన్నికల శంఖం పూరించారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అభ్యర్థుల జాబితాను ప్రకటించి.. నేడు హుస్నాబాద్‌లో ఎన్నికల ప్రచారాన్ని సైతం నిర్వహిస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ అసలు ఎన్నికలు ఎప్పుడు..? నోటిఫికేషన్ ఎప్పుడు ప్రకటిస్తారు అనే ఉత్కంఠ మాత్రం అన్ని వర్గాల్లో ఉంది.

ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ అత్యవసరంగా సమావేశమైంది. ఈ సమావేశంలో మాట్లాడిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓపీ రావత్.. తెలంగాణ ఎన్నికలపై ఎలాంటి ఊహాగానాలకు తావులేదన్నారు. 2002 సుప్రీంకోర్టు రూల్ ప్రకారం అసెంబ్లీ రద్దయితే వెంటనే ఎన్నికలు జరపాల్సి ఉంటుందన్నారు.

6 నెలల పాటు అపద్ధర్మ ప్రభుత్వాన్ని కొనసాగించాల్సిన అవసరం లేదని.. నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో పాటే తెలంగాణలోనూ ఎన్నికలు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నామని రావత్ వెల్లడించారు.