Pegasus Latest Update:  మొబైల్ ఫోన్లపై నిఘా పెట్టే ఇజ్రాయెల్ 'పెగాసస్' స్పైవేర్‌కు సంబంధించి 2017లో ఇజ్రాయెల్, భారత్ మధ్య ఒప్పందం జరిగింద‌నే ఆరోపణ‌ల‌పై  కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం స్పందించారు. పెగాసస్ స్పైవేర్ కొత్త వెర్షన్ వచ్చిందా అని ఇజ్రాయెల్‌ను అడగడానికి ఇదే సరైన తరుణమని కేంద్రంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

Pegasus Latest Update: ఐదు రాష్ట్రాల ఎన్నికలతో భార‌త దేశ రాజ‌కీయం హీటెక్కుతున్న వేళ‌.. పెగాసస్(Pegasus) వ్యవహారంపై దూమారం రేగుతోంది. ఇజ్రాయెల్‌ సంస్థ NSO తయారుచేసిన పెగాసస్‌ స్పైవేర్ ను మోడీ సర్కార్ 2017లోనే కొనుగోలు చేసినట్టు, ఇందుకు సంబంధించి ఇజ్రాయెల్, భారత్ మధ్య ఒప్పందం జరిగిందంటూ న్యూయార్క్‌ టైమ్స్‌ లేటెస్ట్‌గా మరో కథనం ప్రచురించింది. దీంతో ఇండియన్ పాలిటిక్స్ లో ఈ అంశం హ‌ట్ టాఫిక్ గా మారింది. ప్ర‌తిప‌క్ష నేత‌లకు విమ‌ర్శ‌స్త్రంగా మారింది.

తాజాగా ఈ వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం త‌నదైన శైలిలో మోడీ స‌ర్కార్ పై గుప్పించారు. ఇజ్రాయెల్ వద్ద ఏదైనా అధునాతన వెర్షన్ ఉందా అని అడగడానికి ఇదే సరైన సమయమంటూ కేంద్రంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2024 ఎన్నికలకు ముందు లెటెస్ట్‌ స్పైవేర్ లభిస్తే.. భారతదేశం ఇజ్రాయెల్‌కు 4 బిలియన్ డాలర్లు ఇవ్వొచ్చు'' అంటూ చిదంబరం ట్వీట్ చేశారు.

గ‌తంలో భారత్, ఇజ్రాయెల్ మధ్య 2 బిలియన్ డాలర్ల మేరకు ఒప్పందం జరిగిందని, అత్యాధునిక ఆయుధాలు, క్షిపణి వ్యవస్థలు, పెగాసస్ స్పైవేర్ కేంద్రకంగా ఈ డీల్ జరిగిందని ఆరోపించారు. 2017లో అయితే.. 2 బిలియన్ డాలర్లకు ఒప్పందం జ‌రిగింద‌నీ, ఈసారి 2024 ఎన్నికలకు అయితే 4 బిలియన్​ డాలర్లకు స్పైవేర్​ కొంటారమే అంటూ బీజేపీ సర్కారుపై వ్యంగాస్త్రాలు సంధించారు. 

2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, ఇద్దరు కేంద్ర మంత్రులు, మాజీ ఎన్నికల కమిషనర్, ఇద్దరు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్లు, మాజీ న్యాయమూర్తి, అటార్నీ జనరల్, 40 మంది జర్నలిస్టులపై నిఘా పెట్టారని.. ఇది వాస్తవం కాదా అని చిదంబరం కేంద్రాన్ని నిలదీశారు. 

ఈ విష‌యంపై రాహుల్ గాంధీ ధ్వజ‌మెత్తారు. ప్ర‌జాప‌తినిధలు, ప్రజలపై నిఘా పెట్టేందుకు మోదీ ప్రభుత్వం పెగాసస్ Pegasus ను కొనుగోలు చేసిందని ఆరోపించారు. అధికార పార్టీలోని నేతలతో పాటు విపక్ష నేతలనూ లక్ష్యంగా చేసుకున్నారని ఆయన మండిపడ్డారు. అందరి ఫోన్ల‌ను ట్యాప్ చేశారని, ఇది దేశ ద్రోహమేనని ఆరోపించారు.

Pegasus విష‌యంపై ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కూడా స్పందించారు. దేశ ప్ర‌జ‌ల‌ను మోడీ ప్రభుత్వం ఎందుకు శత్రువులా చూస్తున్నదని ప్రశ్నించారు. అక్రమంగా నిఘా పెట్టడం దేశద్రోహం వంటిదేన‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

కాగా, న్యూయార్క్ టైమ్స్ పత్రిక Pegasus కథనంపై కేంద్రమంత్రి వీకే సింగ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అదొక సుపారీ మీడియా మండిపడ్డారు. కేంద్రమంత్రి వ్యాఖ్యలను చిదంబరం తప్పుబట్టారు. ఎప్పుడైనా న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ వంటి పత్రికలను చదివారా? వాటర్ గేట్, పెంటగాన్ స్కామ్ ల‌ను బట్టబయలు చేయడం పత్రికలు ఎంత కీలక పాత్ర పోషించాయా తెలుసా? చరిత్ర తెలుసుకోవడం నచ్చకపోతే కనీసం సినిమాలు చూసైనా నేర్చుకోవాల‌ని హితవు పలికారు. ఈ ఆరోపణలపై ఇప్పటికే విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు గత ఏడాది అక్టోబర్ 27న ముగ్గురు సభ్యుల సైబర్ నిపుణుల ప్యానెల్‌ను నియమించింది.