సారాంశం
ఛత్తీస్‌గడ్‌లో ఓ ఫుడ్ ఆఫీసర్ తన ఖరీదైన ఫోన్‌ను డ్యామ్‌లో పోగొట్టుకున్నాడు. ఆ ఫోన్‌ను ఈతగాళ్లతో గాలించినా దొరకలేదు. దీంతో ఆ రిజర్వాయర్ నుంచి రెండు మోటర్లతో మూడు రోజులపాటు నీటిని తోడేశాడు. మూడు రోజులపాటు నీటిలో ఉన్న ఆ ఫోన్ తీసిన తర్వాత పని చేయడం లేదు.
న్యూఢిల్లీ: ఛత్తీస్‌గడ్‌లో ఓ దారుణ ఘటన జరిగింది. ఓ ప్రభుత్వ అధికారి ఈత కొట్టడానికి వెళ్లి ఓ డ్యామ్‌లో తన ఖరీదైన ఫోన్‌ను పోగొట్టుకున్నాడు. ఆ ఫోన్‌ను వెతికి పట్టుకోవడానికి స్థానిక జాలర్లతో గాలించాడు. కానీ, ఫోన్ దొరకలేదు. ఆ రిజర్వాయర్‌లో నీటి మట్టం తక్కువగా ఉంటే తాము వెతికి పట్టుకుంటామని వివరించారు. దీంతో ఆ అధికార ఏకంగా డ్యామ్‌లోని సుమారు 21 లక్షల లీటర్ల నీటిని మోటర్లతో మూడు రోజుల పాటు తోడేశాడు. ఈ నీరు పంట సాగుకు మళ్లించాల్సింది. కానీ, ఫోన్ కోసం డ్యామ్‌లోని నీటిని తోడేయడంతో ఇరిగేషన్ శాఖకు చెందిన ఓ అధికారి ఫిర్ాయదు చేశారు. ఆ ఫిర్యాదు అందిన తర్వాత నీటిని తోడేయడాన్ని ఆపేశాడు.
కాంకేర్ జిల్లా కోయిలిబేడా బ్లాక్ ఫుడ్ ఆఫీసర్ రాజేశ్ విశ్వాస్ ఆదివారం తన ఆఫ్ రోజున ఖేర్కట్టా డ్యామ్‌కు కొంత మంది మిత్రులతో కలిసి ఈత కొట్టడానికి వెళ్లారు. ఈత కొడుతుండగా రాజేశ్ విశ్వాస్ రూ. 1 లక్ష విలువైన ఖరీదైన తన ఫోన్‌ను ఆ డ్యామ్‌లో పోగొట్టుకున్నాడు. అప్పుడు ఆ డ్యామ్ లోతు 15 అడుగులు ఉంటుందని అంచనా. స్థానికులు ఆ ఫోన్‌ను వెతికి పట్టడానికి ప్రయత్నాలు చేశారు. కానీ, అది సాధ్యం కాలేదు. దీంతో రెండు 30 హెచ్‌పీ డీజిల్ పంప్‌లను పెట్టి మూడు రోజుల పాటు నీటిని తోడేశారు. 1,500 ఎకరాల సాగు భూమికి సరిపడా నీటి పారుదలను ఆ అధికారి తన ఫోన్ కోసం తోడేశాడు.
సోమవారం సాయంత్రం పంప్‌లతో నీటి తోడకం మొదలు పెట్టి గురువారం వరకు ఆ మోటర్లు నడిపించాడు. ఇరిగేషన్ అధికారి ఒకరు స్పాట్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అప్పుడు నీటి పారుదలను ఆపేశారు. 21 లక్షల లీటర్ల నీటిని తోడేసినా ఆరు అడుగుల లోతు మేరకు నీరు ఉన్నది. ఆ డ్యామ్‌లో 10 అడుగుల లోతు నీరు ఎప్పుడూ వేసవి అయినా ఉంటుందని, జంతువులూ ఆ నీరు తాగుతాయని వివరించారు.
ఆ నీరు ఎందుకు ఉపయోగించమని నీటి వనరు శాఖ అధికారుల నుంచి మౌఖిక సలహాలు తీసుకున్న తర్వాతే తాను ఆ నీటిని తోడేశానని వివరించారు. ఎస్‌డీఓ అధికారికి తాను ఫోన్ చేసి నీటిని తోడేయడానికి అనుమతులు తీసుకున్నానని తెలిపారు. మూడు నుంచి నాలుగు అడుగుల లోతు నీటిని తోడేసినా వచ్చే సమస్య ఏమీ లేదని వివరించారని రాజేశ్ విశ్వాస్ తెలిపారు. అందుకే తాను స్థానికుల సహాయంతో నీటిని తోడేశానని వివరించారు.
నీటి మట్టం తగ్గిన తర్వాత ఈతగాళ్లు ఫోన్‌ను వెతికిపట్టుకున్నారు. కానీ, మూడు రోజులు నీటిలో ఉండటంతో అది పని చేయడం లేదు.