ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో (Dantewada district) అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతిచెందాడు.
ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో (Dantewada district) అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతిచెందాడు. మృతిచెందిన మావోయిస్టుపై రూ. 5 లక్షల రివార్డు ఉందని అధికారి తెలిపారు. ఆ మావోయిస్టు దంతెవాడ జిల్లాలో అనేక హింసాత్మక ఘటనల్లో నిందితుడిగా ఉన్నాడని పేర్కొన్నారు. జిల్లా రిజర్వ్ గార్డ్ బృందం.. నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌లో ఉన్నప్పుడు అరన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుర్గం గ్రామ సమీపంలోని అడవిలో శనివారం అర్ధరాత్రి కాల్పులు జరిగాయని దంతెవాడ పోలీసు సూపరింటెండెంట్ సిద్ధార్థ్ తివారీ తెలిపారు.
ఎదురుకాల్పులు ముగిసిన తర్వాత.. ఒక నక్సల్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మృతుడిని 34 ఏళ్ల అర్జున్ అలియాస్ లఖ్మా సోడి (Lakhma Sodi )గా గుర్తించినట్టుగా చెప్పారు. అతనిపై రూ. 5 లక్షల రివార్డు ఉందని తెలిపారు.
మావోయిస్టు మలంగర్ ఏరియా కమిటీకి మిలీషియా కమాండర్ ఇన్‌ఛార్జ్‌గా అర్జున్ చురుకుగా పనిచేశాడని.. అతను హత్య, హత్యాయత్నం, అపహరణతో సహా 13 హింసాత్మక సంఘటనలలో పాల్గొన్నాడని తెలిపారు. ఘటన స్థలం నుంచి ఒక పిస్టల్, 5 కిలోల టిఫిన్ బాంబు, నక్సల్ యూనిఫామ్, విద్యుత్ తీగలు, వైర్ కట్టర్, నక్సల్ లిటరేచర్, కొన్ని క్యాంపింగ్ మెటీరియల్‌లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
