ఛత్తీస్ ఘడ్: ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం బిజాపూర్ పమేద్ ఏజెన్సీ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఐదుగురు కోబ్రా బెటాలియన్ లు  తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు.

ఛత్తీస్ ఘడ్ లో ఎన్నికల నేపథ్యంలో తెల్లవారు జాము నుంచే మావోయిస్టులు రెచ్చిపోయారు. ఇప్పటికే ఎన్నికలను బహిష్కరించాలంటూ వాల్ పోస్టర్లు సైతం విడుదల చేశారు. మావోయిస్టుల పిలుపు నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేసింది ప్రభుత్వం. లక్ష మందితో ఎన్నడూ లేనివిధంగా భారీ భద్రతను ఏర్పాటు చేసింది. 

కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినా మావోయిస్టులు రెచ్చిపోయారు. దంతెవాడ జిల్లా కటేకల్యాన్ అటవీ ప్రాంతంలో మందుపాతర పేల్చారు. పోలింగ్ కేంద్రానికి కిలోమీటర్ దూరంలో ఈపేలుడు సంభవించడంతో ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. అయితే కాసేపు రాకపోకలను నిలిపివేశారు. పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి  ఆరు మందుపాతరలను నిర్వీర్యం చేశారు. 

మావోల అలజడి నేపథ్యంలో బిజాపూర్ పమేద్ అటవీ ప్రాంతంలో  కోబ్రా బెటాలియన్ బృందం జల్లెడ పట్టింది. ఆ సమయంలో వారికి నక్సలైట్లు తారసపడటంతో ఇరువురి మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హతమవ్వగా, ఐదుగురు కోబ్రా బెటాలియన్లు గాయాలపాలయ్యారు. వారిని బిజాపూర్ లోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కోబ్రా బెటాలియన్లు కోలుకుంటున్నట్లు వైద్యులు నిర్ధారించారు.