చత్తీస్‌గడ్ సీఎం భుపేశ్ బఘేల్ తండ్రి నంద్‌కుమార్ బఘేల్‌ను రాయ్‌పూర్ పోలీసులు అరెస్టు చేశారు. బ్రాహ్మణులపై ఆయన చేసిన వ్యాఖ్యలకుగాను కేసు నమోదైంది. ఈ కేసులో నంద్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనను 15 రోజుల కస్టడీకి పంపింది.

రాయ్‌పూర్: చత్తీస్‌గడ్ ముఖ్యమంత్రి భుపేశ్ బఘేల్ తండ్రి నంద్‌కుమార్ బఘేల్‌ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. బ్రాహ్మణులపై ఆయన చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకుగాను డీడీ నగర్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. రాయ్‌పూర్ పోలీసులు తాజాగా నంద్‌కుమార్ బఘేల్‌ను అరెస్టు చేశారు. ఈ కేసుపై విచారణ జరుగుతున్న న్యాయస్థానంలో ఆయనను హాజరుపరిచారు. న్యాయస్థానం ఆయనను 15 రోజుల కస్టడీకి పంపింది.

బ్రాహ్మణులు విదేశీయులని నంద్‌కుమార్ బఘేల్ ఇటీవలే ఓ ప్రసంగంలో పేర్కొన్నారు. వారు స్వయంగా సంస్కరించుకోవాలని, లేదంటే వారిని గంగా నది నుంచి వోల్గా నదికి పంపాలని అన్నారు. ఈ వ్యాఖ్యలపై డీడీ నగర్ పోలీసు స్టేషన్‌లో బ్రాహ్మణ వర్గానికి చెందిన ఓ సంఘం ఫిర్యాదు చేసింది. సమాజంలో విద్వేషాన్ని రగిల్చేలా ఆయన వ్యాఖ్యలున్నాయని, శాంతి సామరస్యాలకు భంగం కలిగిస్తున్నాయని పేర్కొంది. ఈ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ కేసుపై సీఎం భుపేశ్ కుమార్ బఘేల్ స్పందించారు. ‘ఒక కుమారుడిగా నేను నా తండ్రిని గౌరవిస్తాను. కానీ, శాంతి భద్రతలకు భంగం కలిగించేలా మాట్లాడితే ఒక సీఎంగా ఉపేక్షించను. చట్టానికి ఎవరూ అతీతులు కాదు’ అని స్పష్టం చేశారు.