Asianet News TeluguAsianet News Telugu

మావోయిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు నివాళి.. జవాన్ శవపేటిక మోసిన సీఎం బఘేల్

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు జరిపిన పేలుడులో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల భౌతిక కాయాలకు గురువారం పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. 
 

chhattisgarh cm bhupesh baghel gives shoulder to the mortal remains of a drg jawan ksm
Author
First Published Apr 27, 2023, 3:50 PM IST

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో బుధవారం రోజున మావోయిస్టులు జరిపిన పేలుడులో 10 మంది జవాన్లు, ఒక సివిల్ డ్రైవర్ మరణించిన ఘటన తీవ్రంగా కలిచివేసిన సంగతి తెలిసిందే. దంతేవాడ జిల్లాలోని కర్లీ ప్రాంతంలోని పోలీస్ లైన్స్‌లో మృతుల భౌతిక కాయాలకు గురువారం పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. వారి భౌతికకాయాల వద్ద పుష్పగుచ్ఛాలను ఉంచారు. ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ కూడా మృతుల భౌతికకాయాలకు నివాళులర్పించారు.   రాష్ట్ర హోం మంత్రి తామ్రధ్వాజ్ సాహు, ఎంపీలు దీపక్ బైజ్, ఫూలోదేవి నేతమ్, రాష్ట్ర డీజీపీ అశోక్ జునేజా మృతులకు నివాళులర్పించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. జవాన్ల మృతదేహాలను స్వస్థలాలకు తరలిస్తున్న వాహనం వద్దకు తీసుకెళ్తున్న సమయంలో.. ఓ జవాన్ శవపేటికను సీఎం భూపేష్ బఘేల్ తన భుజాలపై మోశారు. ఇతరులతో కలిసి శవపేటిన వాహనం వద్దకు చేర్చారు. 

మావోయిస్టుల దాడిలో మరణించిన జవాన్లకు నివాళులర్పించిన అనంతరం ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ మాట్లాడుతూ.. జవాన్ల త్యాగం వృథా కాబోదని, మావోయిస్టులపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్నారు. ఇక, బీజేపీ ఛత్తీస్‌గఢ్ ఇంచార్జి ఓం మాథుర్, ఇతర నాయకులు కూడా జవాన్ల భౌతికకాయాల పుష్పగుచ్ఛం ఉంచి అమరవీరులకు నివాళులర్పించారు. అయితే ఆ ప్రాంతంలో చనిపోయినవారి కుటుంబ సభ్యుల రోదనలు చూపరులను కలిచివేశాయి. మరోవైపు ఆ ప్రాంతం అంతా ‘‘భారత్ మాతా కీ జై’’నినాదాలతో మారుమోగింది. 

ఇక, దంతెవాడలోని అరన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భద్రతా సిబ్బందిని తీసుకెళ్తున్న కాన్వాయ్‌లో భాగమైన మల్టీ యుటిలిటీ వెహికల్ (ఎంయూవీ)ని బుధవారం మధ్యాహ్నం మావోయిస్టులు పేల్చివేశారు. ఈ ఘటనలో జిల్లా రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ)కి చెందిన పది మంది జవాన్లు, ఒక సివిల్ డ్రైవర్ మరణించారు. 40 కిలోల పేలుడు పదార్థం ఉన్న ఐఈడీని ఉపయోగించి ఈ పేలుడు జరిగింది. స్పాట్ నుండి విజువల్స్ పేలుడు జరిగిన ప్రదేశంలో దాదాపు 10 అడుగుల లోతులో రోడ్డుకు అడ్డంగా భారీ బిలం కనిపించింది. పేలుడు ధాటికి ఎంయూవీ వాహనం పూర్తిగా ధ్వంసమైంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios