ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ శుక్రవారం నాడు రాష్ట్రపతి ఇచ్చే జీ20 విందుకు హాజరుకావడం లేదని తెలిపారు.  ఢిల్లీ ఇప్పుడు నో ఫ్లై జోన్‌గా మారిందని.. ఎలా వెళ్లమంటారు అంటూ సీఎం ప్రశ్నించారు. 

మరికొద్దిగంటల్లో ఢిల్లీ వేదికగా జీ20 సమావేశాలు జరగనున్నాయి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఒక్కొక్కరిగా అతిథులు ఢిల్లీ చేరుకుంటున్నారు. ఇందుకోసం పోలీసులు డేగ కళ్లతో పహారా కాస్తున్నారు. ఢిల్లీ మొత్తం భద్రతా దళాల ఆధీనంలోకి వెళ్లిపోయింది. ఇదిలావుండగా.. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ శుక్రవారం నాడు రాష్ట్రపతి ఇచ్చే జీ20 విందుకు హాజరుకావడం లేదని తెలిపారు. దీనికి కారణం కూడా ఆయన చెప్పారు. జీ20 సమ్మిట్‌ను పురస్కరించుకుని భద్రతా చర్యల కారణంగా ఢిల్లీకి, ఢిల్లీ నుంచి బయటకు విమాన రాకపోకలను ప్రభుత్వ నిషేధించింది. ఢిల్లీ ఇప్పుడు నో ఫ్లై జోన్‌గా మారిందని.. ఎలా వెళ్లమంటారు అంటూ సీఎం ప్రశ్నించారు. 

ముందుగా షెడ్యూల్ చేసిన, జీ20 సమ్మిట్ స్పెషల్ విమానాలు మాత్రమే అనుమతిస్తామని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం స్పష్టం చేసింది. సాధారణ ఏవియేషన్, నాన్ షెడ్యూల్డ్ చార్టర్డ్ విమానాలతో సహా అన్ని విమానాలు ఈ రెండు రోజులూ నిషేధించినట్లు పేర్కొంది. 

Also Read: G20 India 2023: జీ20 సదస్సుకు హాజరయ్యే ప్రపంచ దేశాధినేత‌లు వీరే.. రానివారు ఎవ‌రంటే..?

శనివారం భారత మండపంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన ప్రత్యేక విందుకు జీ20 ప్రముఖులతో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులకు భారత ప్రభుత్వం ప్రత్యేక ఆహ్వానాలు పంపింది. మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, హేమంత్ సోరెన్‌, నితీష్ కుమార్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ విందుకు పలువురు విపక్షనేతలకు కేంద్రం ఆహ్వానాలు పంపలేదు. వీరిలో కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎంపీ మల్లిఖార్జున ఖర్గే కూడా వున్నారు. దీనిపై భూపేష్ బఘేల్ స్పందిస్తూ.. కేంద్రం తీరును ఖండించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలను గౌరవించాలన్నారు. ఖర్గేను విందుకు ఆహ్వానించకపోవడం ప్రజాస్వామ్యంపై దాడిగా సీఎం అభివర్ణించారు. 

కాగా.. G20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం సెప్టెంబర్ 9-10 వరకు ప్రగతి మైదాన్‌లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్‌లోని భారత్ మండపంలో జరుగుతుంది. ప్రస్తుతం భారతదేశం G20 అధ్యక్ష హోదాలో వుంది.