ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తొలి దశ పోలింగ్ ఇవాళ ఉదయం ప్రారంభమైంది. మొత్తం 90 స్థానాలున్న ఛత్తీస్‌గఢ్‌ శాసనసభలో మొదటిదశలో భాగంగా బీజాపూర్, నారాయణ్‌పూర్, కాంకేర్, బస్తర్, సుక్మా, రాజనందగావ్, దంతెవాడ జిల్లాల్లోని 18 నియోజకవర్గాల్లో ఇవాళ పోలింగ్ జరుగుతుంది..

ఇవన్నీ మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాలే.. ఎన్నికలు బహిష్కరించాలంటూ మావోలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎన్నికల సంఘం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. 50 డ్రోన్లు, 17 హెలికాఫ్టర్లు, 100 శాటిలైట్ ట్రాకర్స్‌తో భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది.

మావోలకు గట్టి పట్టున్న పది ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటలకు పోలింగ్ ముగియనుంది. మిగిలిన ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 32 లక్షల మంది ఓటర్ల కోసం 4,336 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

మరోవైపు భద్రతను సవాల్ చేస్తూ.. దంతెవాడ మావోలు మందుపాతర పేల్చారు. పోలింగ్ కేంద్రానికి కిలోమీటరు దూరంలో పేలుడు సంభవించింది. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది.. మరో ఆరు మందుపాతరలను గుర్తించి వాటిని నిర్వీర్యం చేశారు.