రాయ్‌పూర్:ఛత్తీస్‌ఘడ్ ఎన్‌కౌంటర్‌లో ఎనిమిది మంది జవాన్లు మరణించారు. మరో 21 మంది  జవాన్లు ఆచూకీ దొరకడం లేదు.కూంబింగ్ కు వెళ్తున్న 660 మంది జవాన్లపై మావోయిస్టులు దాడికి దిగారు. మావోల దాడిలో మరో 31 మంది జవాన్లు గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం పోలీసులు రాయ్‌పూర్ ఆసుపత్రికి తరలించారు.

బీజాపూర్‌ జిల్లాలో శనివారం నాడు  కూంబింగ్ కు వెళ్తున్న జవాన్లపై మావోయిస్టులు అదును చూసి దెబ్బకొట్టారు. పెద్ద ఎత్తున మావోయిస్టులు జవాన్లను లక్ష్యంగా చేసుకొని ఆధునాతన ఆయుధాలతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో 8 మంది జవాన్లు మరణించారు. 31 మంది గాయపడ్డారు. 

ఈ కాల్పుల తర్వాత సుమారు 21 మంది జవాన్ల ఆచూకీ కన్పించకుండా పోయిందని  సమాచారం. అయితే ఏడుగురు జవాన్ల ఆచూకీ కన్పించడం లేదని భద్రతావర్గాలు తెలిపాయి.జాయింట్ సెక్యూరిటీ ఫోర్స్, యాంటీ నక్సల్స్ ఆపరేషన్ సిబ్బంది సంయుక్తంగా కూంబింగ్ కు వెళ్తున్న సమయంలో  మావోయిస్టులు కాల్పులకు దిగినట్టుగా డీజీపీ డీఎం అవస్తీ తెలిపారు.

10 రోజులుగా ఛత్తీ‌స్‌ఘడ్ లోమాద్వి హిడ్మా ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఛత్తీస్‌ఘడ్ ఎన్‌కౌంటర్ లో 8 మంది జవాన్లు మృతిచెందడంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంతాపం తెలిపారు.