లండన్ లో ఇండియన్ యువతి ఒకరు కిడ్నాప్ కి గురయ్యారు. చెన్నైకి చెందిన యువతి సంపన్నురాలు కాగా.. ప్రేమ పేరిట మోసం చేసి మరీ యువతిని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. సదరు యువతితో బలవంతంగా మత మార్పిడి చేయించి బంగ్లాదేశ్ కి తరలించారు. అనంతరం యువతి కుటుంబసభ్యులకు ఫోన్ చేసి డబ్బులు కావాలంటూ బెదిరించారు. కాగా.. వాళ్లు.. పోలీసులను ఆశ్రయించడంతో.. ఈ కేసులోకి ఎన్ఐఏ రంగంలోకి దిగింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. చెన్నైకి చెందిన ఓ యువతి ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లింది. సదరు యువతిది సంపన్న కుటుంబం కావడం గమనార్హం. కాగా.. యువతి ఆస్తి పై కన్నేసిన ముఠా ..  మాస్టర్ ప్లాన్ వేసింది. ప్రేమ పేరుతో యువతికి గాలం వేశారు. నజీష్ అనే వ్యక్తి ప్రేమ పేరిట యువతికి దగ్గరయ్యాడు. 

అతడి వలలో పడ్డ ఆ యువతి చివరకు మత మార్పిడి చేసుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది.ఆ యువకుడి తండ్రి షౌకత్‌ హుస్సేన్, స్నేహితులు యూనిష్‌ మాలిక్, నవాజ్‌లతో పాటు మరి కొందరు వీరికి సహకరించారు. ఉన్నత చదువుల నిమిత్తం లండన్‌కు వెళ్లిన తమ కుమార్తె మతమార్పిడితో బంగ్లాదేశ్‌కు తరలించబడ్డట్టుగా చెన్నైలోని తల్లిదండ్రులకు సమాచారం అందింది. అయితే, ఆ యువతిని కిడ్నాప్‌ చేయడం లక్ష్యంగానే ఆ యువకుడు, అతడి తండ్రి, స్నేహితులతో పాటు ముంబై పోలీసుల వాంటెడ్‌ లిస్ట్‌లో ఉన్న జకీర్‌ నాయక్‌ ప్రేమ నాటకం ఆడినట్టు వెలుగు చూసింది.

ఆ యువతిని కిడ్నాప్‌ చేసినట్టు, విడుదల చేయడానికి కొన్ని కోట్లను డిమాండ్‌ చేసినట్టు సమాచారం. సంపన్న కుటుంబం వ్యక్తి కావడంతో తన పలుకుబడితో వ్యవహారాన్ని ఢిల్లీ స్థాయిలోకి ఆ యువతి తండ్రి తీసుకెళ్లారు. దీంతో ఎన్‌ఐఏను కేంద్రం రంగంలోకి దించింది. యువతి కిడ్నాప్‌ విషయంగా ఎన్‌ఐఏ తన విచారణను వేగవంతం చేసింది. అయితే, తమ బిడ్డ సురక్షితంగా చెన్నైకు రావాలని ఆ కుటుంబం ప్రార్థనల్లో లీనమైంది. ఈ కుటుంబం పూర్వీకం ఉత్తరాది అయినా, కొన్నేళ్ల క్రితం చెన్నైలో స్థిరపడ్డారు. ఆ యువతి విలాసవంతమైన జీవితం, ఆడంబరాలు, విచ్చల విడితనం వెరసి పథకం ప్రకారం కిడ్నాప్‌ చేసినట్టు తేలింది.