తనను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని, వివాహేతర సంబంధం నేరం కాదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందంటూ వాదించాడు.

వివాహేతర సంబంధం నేరం కాదు అంటూ.. ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ తీర్పు ఇద్దరు భార్యభర్తల మధ్య చిచ్చుపెట్టింది. చివరకు ఒకరి ప్రాణాలు కూడా పోయాయి. ఈ సంఘటన చెన్నై నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...చెన్నై ఎంజీఆర్‌నగర్, నెసపాక్కం భారతీనగర్‌ రామదాస్‌ వీధికి చెందిన పుష్పలత (24). ఈమె భర్త జాన్‌ ఫ్రాంక్లిన్‌.. గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ పార్కులో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. వీరిద్దరూ పెద్దలను అభీష్టానికి వ్యతిరేకంగా రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒకటిన్నర ఏడాది పాప ఉంది. పుష్పలత క్షయ వ్యాధి బారిన పడటంతో జాన్‌ తన భార్యను పట్టించుకోవడం మానేశాడు. తనతో కలిసి పనిచేసే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

ఈ విషయం పుష్పలతకు తెలియడంతో ఆమె శనివారం భర్తను నిలదీసింది. పోలీసు కేసు పెడతానని కూడా బెదిరించింది. అయితే తనను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని, వివాహేతర సంబంధం నేరం కాదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందంటూ వాదించాడు. దీంతో మనస్తాపానికి గురైన పుష్పలత శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. విషయం తెలిసి ఎంజీఆర్‌ నగర్‌ పోలీసులు సంఘటన స్థలం చేరుకుని విచారణ జరిపారు. పుష్పలత మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు విచారణ జరుపుతున్నారు.