చెన్నై:కరోనా వ్యాక్సిన్ ప్రయోగాల్లో పాల్గొన్న వలంటీర్ నష్టపరిహారం కోరుతూ సీరం ఇనిస్టిట్యూట్ కు నోటీసులు పంపారు. తనకు రూ. 5 కోట్లు చెల్లించాలని నోటీసులు పంపాలని కోరారు.

కరోనా వైరస్ వ్యాక్సిన్ కొవిషీల్డ్ ప్రయోగాల్లో చెన్నైకి చెందిన ఓ వ్యక్తి వలంటీర్ గా పాల్గొన్నాడు. ఆయన వయస్సు 40 ఏళ్లు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. 

కరోనా మూడో దశ ప్రయోగాల్లో పాల్గొనేందుకు వలంటీర్లు కావాలని రామచంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ , రీసెర్చ్ సంస్థ ప్రకటన ఇచ్చింది.ఈ ప్రకటనను చూసి ఆ వ్యక్తి ధరఖాస్తు చేసుకొన్నాడు.

ఈ వ్యాక్సిన్ ప్రయోగంలో పాల్గొంటే  ప్రయోగ ఫలితాలు సంభవించగలవని సమాచారపత్రంలో పేర్కొనలేదని బాధితుడు తెలిపారు.

ఈ వ్యాక్సిన్ డోస్ ను ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీన తనకు ఇచ్చారని ఆయన చెప్పారు. పది రోజుల పాటు ఎలాంటి ఇబ్బందులు రాలేదన్నారు. అక్టోబర్ 11న తనకు భరించలేని తలనొప్పి, వాంతులు, తల తిరిగిందన్నారు.  తాను కనీసం లేచి నిల్చునే పరిస్థితే లేదన్నారు.దీంతో తనకు వైద్యులు చికిత్స అందించారని ఆయన చెప్పారు. 16 రోజుల తర్వాత తాను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయినట్టుగా ఆయన వివరించారు.

ఈ ట్రయల్స్ లో పాల్గొన్న తనకు నాడీ సంబంధ సమస్యలు తలెత్తాయన్నారు.  భవిష్యత్తులో తనకు తలెత్తే  ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకొని  రూ. 5 కోట్ల పరిహారం కోరుతూ ఆయన నోటీసులు పంపారుసీరం ఇనిస్టిట్యూట్ కి నవంబర్ 21న నోటీసును పంపారు. అయితే తన నోటీసుకు ఇంతవరకు సమాధానం రాలేదని బాధితుడు తెలిపారు.