అత్యవసర పరిస్థితుల్లోనే ప్రజలు బయటకు రావాలని అధికారులు సూచించారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని విజ్ఞప్తి చేశారు.
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజు రోజుకీ వేల సంఖ్యలో కేసులు పెరిగిపోతున్నాయి. లాక్ డౌన్ సడలింపులతో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. కాగా... చెన్నై నగరంలోనూ కరోనా విలయతాండవం చేస్తోంది. దీనిని అదుపుచేసేందుకు తమిళనాడు ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది.
జూన్ 19వ తేదీ నుంచి దాదాపు 12 రోజులపాటు లాక్ డౌన్ విధించాలని నిర్ణయం తీసుకుంది. తమిళనాడులోని చెన్నై, చెంగల్ పేట, కంచీపురం, తిరువళ్లూరులో జూన్ 30వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగించింది. అత్యవసర పరిస్థితుల్లోనే ప్రజలు బయటకు రావాలని అధికారులు సూచించారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని విజ్ఞప్తి చేశారు.
తమిళనాడు రాష్ర్టంలో ఇప్పటి వరకు 52,334 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. కొవిడ్-19తో 625 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన రెండు రోజుల్లోనే 2వేల కేసులు నమోదయ్యాయని అధికారులు చెబుతున్నారు. కరోనా పాజిటివ్ కేసుల్లో దేశంలో మహారాష్ర్ట ప్రథమ స్థానంలో నిలవగా, తమిళనాడు రెండో స్థానంలో ఉంది.
దేశంలో ఇప్పటి వరకు 3,81,091 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 12,604 మంది చనిపోయారు. అత్యధికంగా మహారాష్ర్టలో 1,20,504 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అక్కడ 5,751 మంది ప్రాణాలు విడిచారు.
ఇదిలా ఉంటే నిపుణుల వాదన మాత్రం మరోలా ఉంది. ఊరికే లాక్ డౌన్ పొడిగించడం కాకుండా.. పక్కా ప్రణాళికతో ముందుకు పోవాలని సూచిస్తున్నారు. కరోనాని అరికట్టుందుకు పగడ్బందీగా నియమాలు అమలు చేయాలని భావిస్తున్నారు. అయితే.. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం లాక్ డౌన్ పొడిగింపుకే నిర్ణయం తీసుకుంది.
